నన్ను చంపుతామని కూడా బెదిరించారు: కత్తి కార్తీక

17-10-2020 Sat 16:36
I never deceived any one says anchor Kathi Karthika
  • కేసు పెట్టిన వ్యక్తికి రెండు నెలల క్రితమే లీగల్ నోటీసులు ఇచ్చాం
  • నేను ఎవరినీ మోసం చేయలేదు
  • రాజకీయాల్లోకి వస్తే.. ఇన్ని అడ్డంకులు పెడుతారా?

యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ కత్తి కార్తీకతో పాటు ఆరుగురిపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. 52 ఎకరాల స్థలాన్ని రూ. 35 కోట్లకే ఇప్పిస్తామని చెప్పి... కోటి రూపాయలు అడ్వాన్స్ గా తీసుకుని మోసం చేశారంటూ వారిపై కేసు నమోదు చేశారు.

ఈ అంశంపై కత్తి కార్తీక స్పందించారు. తాను ఎవరినీ మోసం చేయలేదని చెప్పారు. రాజకీయ కక్షతోనే తనపై కేసులు పెడుతున్నారని అన్నారు. కేసు పెట్టిన వ్యక్తికి రెండు నెలల క్రితమే లీగల్ నోటీసులు ఇచ్చామని... అలాంటప్పుడు హఠాత్తుగా తమపై చీటింగ్ కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. ఈ మధ్యనే తనను చంపుతామని బెదిరించారని... దీనికి సంబంధించి రామాయంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని చెప్పారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఒక మహిళ రాజకీయాల్లోకి వస్తే... ఇన్ని అడ్డంకులు సృష్టిస్తారా? అని ప్రశ్నించారు. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాజకీయాలను వీడనని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ, దుబ్బాక ఎన్నికల్లోనూ పోటీ చేస్తానని తెలిపారు.