కాంగ్రెస్, బీజేపీ నేతలను ఉసిళ్లతో పోల్చిన హరీశ్ రావు

17-10-2020 Sat 16:30
Minister Harish Rao campaigns in Dubbaka constituency
  • వచ్చిపోతుంటారని ఎద్దేవా
  • టీఆర్ఎస్ నేతలు ప్రజల వెంటే ఉంటారని ఉద్ఘాటన
  • దుబ్బాకలో గెలుపు సోలిపేట సుజాతదేనని ధీమా

దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకుంది. ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్నాయి. ఈ క్రమంలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత తరఫున ప్రచారం చేసేందుకు నేడు మంత్రి హరీశ్ రావు దౌలతాబాద్ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్, బీజేపీ నేతలు వానాకాలంలో వచ్చే ఉసిళ్ల వంటివారని, కానీ టీఆర్ఎస్ నేతలు మాత్రమే నిత్యం ప్రజల వెంట ఉంటారని వ్యాఖ్యానించారు. ఆ రెండు పార్టీలు ఎండమావుల్లాంటివని, వాటి వెంట వెళితే ఏమీ రాదని అన్నారు. గత పాలకులైన కాంగ్రెస్, టీడీపీ నేతల కారణంగా రాష్ట్రంలో తాగునీటికి తీవ్ర సమస్యలు వచ్చాయని, కాంగ్రెస్ హయాంలో రైతులకు విద్యుత్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు.

కాంగ్రెస్ విద్యుత్ ఇవ్వక బాధపెడితే, ఇప్పుడు బీజేపీ మీటర్లు ఏర్పాటు చేయాలని చూస్తోందని మండిపడ్డారు. కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత టీఆర్ఎస్ సర్కారుకే దక్కుతుందని, దుబ్బాక నియోజకవర్గ తొలి మహిళా ఎమ్మెల్యేగా సోలిపేట సుజాత ఎన్నికవడం ఖాయమని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు.