నాకు అత్యుత్తమ వైద్యం అందించారు: కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యసిబ్బందికి కృతజ్ఞతలు తెలిపిన తమన్నా

17-10-2020 Sat 16:03
Tamannaah meets Hyderabad Continental Hospital staff
  • హైదరాబాదులో కరోనా చికిత్స పొందిన తమన్నా
  • పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జి
  • ఆసుపత్రికి వచ్చి వైద్యులను, ఇతర సిబ్బందిని కలిసిన తమన్నా

అందాలభామ తమన్నా కొన్నిరోజుల కిందట కరోనా బారినపడి, చికిత్సతో కోలుకున్నారు. షూటింగ్ కోసం ముంబయి నుంచి హైదరాబాద్ వచ్చిన తమన్నా సెట్స్ పై అస్వస్థతకు గురికావడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని వచ్చింది. దాంతో ఆమె హైదరాబాదులోనే ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. పూర్తిగా కోలుకున్న పిమ్మట డిశ్చార్జి అయ్యారు. ఈ నేపథ్యంలో, తనకు చికిత్స అందించిన హైదరాబాద్ కాంటినెంటల్ ఆసుపత్రి డాక్టర్లకు, నర్సులకు, ఇతర వైద్య సిబ్బందికి తమన్నా ధన్యవాదాలు తెలిపారు.

కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యసిబ్బంది పట్ల తాను ఎంత కృతజ్ఞతతో ఉన్నానో మాటల్లో వర్ణించలేనని పేర్కొన్నారు. కరోనా సోకినప్పుడు తాను ఎంతో అస్వస్థతకు గురై బలహీనంగా ఉన్నానని, ఎంతో భయపడ్డానని తమన్నా వెల్లడించారు. అయితే, కాంటినెంటల్ ఆసుపత్రి వైద్య సిబ్బంది తనను మామూలు మనిషిని చేశారని, అందుకోసం అత్యుత్తమ వైద్యం అందించారని కొనియాడారు.

తాను పూర్తిగా కోలుకునే వరకు ఎంతో దయగా, వృత్తి నిబద్ధతతో జాగ్రత్తగా చూసుకున్నారని తమన్నా ప్రశంసించారు. ఈ మేరకు కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులను, ఇతర సిబ్బందిని కలిసి స్వయంగా కృతజ్ఞతలు తెలిపారు.