అమాయకులను చంపడాన్ని ఎప్పుడూ సమర్థించలేదు: ముత్తయ్య మురళీధరన్

17-10-2020 Sat 15:18
Never Supported Killing Of Innocents says Muthian Muralidaran
  • మురళీధరన్ బయోపిక్ పై తమిళనాడులో వ్యతిరేకత
  • తమిళులను ఊచకోత కోస్తుంటే పట్టించుకోలేదని విమర్శలు
  • తనను తప్పుగా అర్థం చేసుకున్నారన్న మురళీధరన్

శ్రీలంక దిగ్గజ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న '800' చిత్రం వివాదాస్పదమవుతోంది. తమిళ జాతీయులను ఊచకోత కోసిన శ్రీలంక ప్రభుత్వానికి మురళీధరన్ మద్దతుగా ఉన్నాడని తమిళులు మండిపడుతున్నారు. మురళీధరన్ భారతదేశ ద్రోహి అంటూ ప్రముఖ తమిళ సినీ నిర్మాత భారతీరాజా కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా షూటింగ్ ను ఆపేయాలనే డిమాండ్లు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై మురళీధరన్ స్పందించాడు.

దశాబ్దాల పాటు శ్రీలంకలో కొనసాగిన తమిళ జాతి హననాన్ని తాను ఎంజాయ్ చేశాననే కామెంట్లపై ఆవేదన వ్యక్తం చేశాడు. 2009లో తాను చేసిన కామెంట్ ను సరిగా అర్థం చేసుకోలేదని చెప్పాడు. ఎంతో మందిని బలిగొన్న సివిల్ వార్ ముగిసిందనే ఉద్దేశంతోనే ఆనాడు తాను సంతోషంగా ఉన్నానని చెప్పానని తెలిపాడు. ఇరుపక్షాల మధ్య ఇప్పటికైనా రక్తపాతానికి ముగింపు పడిందనే ఉద్దేశంతో ఆ మాట అన్నానని చెప్పాడు. తమిళులను చంపేసిన కారణంగానే తాను సంతోషంగా ఉన్నట్టు దాన్ని వక్రీకరించారని అన్నాడు. తానెప్పుడూ అలా అననని చెప్పాడు. తన తల్లిదండ్రులు, తన ఎదుగుదలకు తోడ్పడిన వారికి గుర్తింపు వస్తుందనే కారణంతోనే తాను '800' చిత్రానికి అంగీకరించానని మురళీధరన్ తెలిపాడు.

కాగా, 2009లో శ్రీలంకలో అంతర్యుద్ధం ముగిసింది. ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ ను పట్టుకుని శ్రీలంక బలగాలు అత్యంత కిరాతకంగా హతమార్చాయి. ఎల్టీటీఈతో జరిగిన తుది సమరంలో పెద్ద ఎత్తున మానవహక్కుల అణచివేత జరిగిందని వార్తలొచ్చాయి. శ్రీలంక సైన్యం జరిపిన బాంబింగ్, కాల్పుల్లో కనీసం లక్ష మంది తమిళ ప్రజలు ప్రాణాలు కోల్పోయారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలోనే మురళీధరన్ చిత్రంపై తమిళనాడులో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

తమిళులు శ్రీలంక బలగాల చేతిలో ఊచకోతకు గురవుతున్న సమయంలో మురళీధరన్ ఆ దేశం కోసం క్రికెట్ ఆడాడని భారతీ రాజా అన్నారు. ఓవైపు తన సొంత జాతి ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే... మరోవైపు ఆ దేశం తరపున ఒక ఆటగాడిగా విజయదరహాసం చేయడం వల్ల ఉపయోగం ఏముందని ప్రశ్నించారు. తమని మురళీధరన్ దారుణంగా వంచించారని ఆయన అన్నారు.