భారత్ నుంచి హాంకాంగ్ వెళ్లినవారికి కరోనా... ఎయిరిండియా విమానాలపై నిషేధం

17-10-2020 Sat 13:50
Hong Kong bans Air India planes for third time
  • ఈ నెల 17 నుంచి  31 వరకు నిషేధం
  • ఎయిరిండియాపై మూడోసారి నిషేధం విధించిన హాంకాంగ్
  • విస్తారా విమానాలపైనా బ్యాన్

భారత్ నుంచి వస్తున్న ప్రయాణికుల్లో కొందరికి కరోనా ఉండడం పట్ల హాంకాంగ్ కఠిన చర్యలు తీసుకుంటోంది. భారత్ నుంచి వచ్చే ఎయిరిండియా, విస్తారా విమానాలపై నిషేధం విధించింది. ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఎయిరిండియా విమానాలను హాంకాంగ్ నిషేధించడం ఇది మూడోసారి. ఇటీవలే భారత్ నుంచి హాంకాంగ్ వచ్చిన కొందరు ప్రయాణికులకు కరోనా పాజిటివ్ అని స్పష్టం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధం అక్టోబరు 17 నుంచి నెలాఖరు వరకు వర్తిస్తుంది.

కాగా టాటా సియా విమానయాన సంస్థకు చెందిన విస్తారా విమానాలపై హాంకాంగ్ నిషేధం విధించడం ఇదే తొలిసారి. ఢిల్లీ నుంచి విస్తారా విమానాల ద్వారా హాంకాంగ్ వచ్చిన ప్రయాణికుల్లో కరోనా పాజిటివ్ వ్యక్తులు ఉన్నట్టు తేలింది. హాంకాంగ్ కరోనా మార్గదర్శకాల ప్రకారం ప్రయాణానికి 72 గంటల ముందు కరోనా టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. నెగెటివ్ ఉన్నవారు మాత్రమే హాంకాంగ్ గడ్డపై కాలు మోపడానికి అర్హులు.

దీనిపై ఎయిరిండియా వర్గాలు స్పందిస్తూ, కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ ఉన్నవాళ్లు మాత్రమే హాంకాంగ్ లో ప్రవేశించేందుకు అర్హులు అని, విమాన ప్రయాణికుల టెస్టు రిపోర్టుల అంశంలో ఎయిరిండియా బాధ్యత వహించబోదని స్పష్టం చేశాయి.