నారా లోకేశ్ కు కౌంటర్ ఇచ్చిన కొడాలి నాని

17-10-2020 Sat 12:30
Kodali Nani gives strong counter to Nara Lokesh
  • రాష్ట్రంలో 8వేల ఇళ్లు నీట మునిగాయన్న లోకేశ్
  • జగన్ ప్యాలెస్ నుంచి బయటకు రావాలని వ్యాఖ్య
  • లోకేశ్ కు కళ్లు నెత్తికెక్కాయన్న కొడాలి నాని

ఏపీలో కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చేతికొచ్చిన పంట నాశనం కావడంతో రైతులు ఆవేదనలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నారా లోకేశ్, కొడాలి నాని మధ్య మాటల తూటాలు పేలాయి. వైసీపీ అధికారంలోకి వస్తే రైతు రాజ్యం నడుస్తుందని  చెప్పిన జగన్... ఇప్పుడు రాష్ట్రంలో రైతే లేకుండా చేస్తున్నారని లోకేశ్ మండిపడ్డారు.

రాష్ట్రంలోని 11 జిల్లాల్లో దాదాపు 8వేల ఇళ్లు నీట మునిగాయని, 14 మంది ప్రాణాలు కోల్పోయారని... దీనికంతా వైపీపీ ప్రభుత్వ వైఫల్యమే కారణమని లోకేశ్ విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి వాస్తవాలు తెలుసుకోవాలని అన్నారు. లేని పక్షంలో ప్రజల తరపున టీడీపీ ఉద్యమిస్తుందని చెప్పారు. ప్రధాని మోదీ ఫోన్ చేసిన తర్వాత వరదలపై జగన్ సమీక్ష నిర్వహించారని ఎద్దేవా చేశారు.

లోకేశ్ వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రానికి ప్రతిపక్ష నేత లోకేశా? లేక చంద్రబాబా? అని ప్రశ్నించారు. మంగళగిరిలో ఓడిపోయిన లోకేశ్ ఏం చూసొచ్చారని ప్రశ్నించారు. లోకేశ్ కు కళ్లు ఇంకా నెత్తిమీద ఉన్నాయని... రానున్న రోజుల్లో కిందకు దింపుతామని చెప్పారు.