'క్రాక్' కోసం అప్సరతో చిందేస్తున్న రవితేజ!

17-10-2020 Sat 12:13
Raviteja to shake a leg with Apsara
  • గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'క్రాక్'
  • హీరో హీరోయిన్లుగా రవితేజ, శ్రుతిహాసన్
  • ప్రత్యేకమైన సెట్స్ లో ఐటెం సాంగ్ చిత్రీకరణ  
  • వర్మ 'థ్రిల్లర్' ద్వారా పరిచయమైన అప్సరరాణి   

స్టార్ హీరోల సినిమాలలో స్పెషల్ సాంగ్ అనేది గత కొంత కాలంగా రివాజు అయిపోయింది. ఇలాంటి పాటల్లో అప్పుడప్పుడు స్టార్ హీరోయిన్లు కూడా తళుక్కున మెరుస్తుంటారు. ఇక విషయానికొస్తే, రవితేజ కూడా తాజాగా తన సినిమా కోసం ఓ స్పెషల్ సాంగును చేస్తున్నాడు.

 గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా 'క్రాక్' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ గత కొంతకాలంగా హైదరాబాదులో జరుగుతోంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ చిత్రం కోసం ఓ ఐటెం సాంగును చిత్రీకరిస్తున్నారు. 

 రాంగోపాల్ వర్మ రూపొందించిన 'థ్రిల్లర్' చిత్రం ద్వారా బాలీవుడ్ కి పరిచయమైన అందాలతార అప్సర రాణి ఈ 'క్రాక్' సినిమా ఐటెం సాంగులో నర్తిస్తోంది. ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో రవితేజ, అప్సరలపై ఈ పాటను జాని మాస్టర్ కొరియోగ్రఫీతో చిత్రీకరిస్తున్నారు. ఇందులో అప్సర తన అందాలను ఆరబోస్తోందని అంటున్నారు.