Jammu And Kashmir: తండ్రి పిలుపునకు మనసు కరిగి, ఏకే 47 కిందపడేసి ఉగ్రవాది లొంగుబాటు.. వీడియో వైరల్

  • ఈ నెల 13న కనిపించకుండా పోయిన జహంగీర్
  • ఎన్‌కౌంటర్ ప్రదేశానికి ఉగ్రవాది తండ్రిని పిలిపించిన జవాన్లు
  • కాల్చబోమని ప్రమాణం చేసి లొంగదీసుకున్న వైనం
army released terrorist surrender video went viral

ఉగ్రవాదానికి ఆకర్షితుడై అందులో చేరిన యువకుడు అక్కడ ఇమడలేక తిరిగి తల్లిదండ్రుల చెంతకు చేరాలని భావించాడు. అయితే, ఎన్‌కౌంటర్ తప్పదని భావించిన అతడిని జవాన్లు ఏమీ చేయకుండా అతడి తల్లిదండ్రులకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 ఈ నెల 13న శ్రీనగర్‌లోని చదూర ప్రాంతానికి చెందిన జహంగీర్ భట్ అనే యువకుడు అదృశ్యమయ్యాడు. దీంతో కుమారుడి కోసం తల్లిదండ్రులు గాలింపు మొదలుపెట్టారు. ఈ క్రమంలో నిన్న ఓ ఆపరేషన్‌లో భద్రతా బలగాలు ఓ ఉగ్రవాదిని చుట్టుముట్టాయి.

అతడు కనిపించకుండా పోయిన జహంగీరే అని గుర్తించిన సైనికులు వెంటనే అతడి తండ్రికి సమాచారం అందించి అక్కడికి పిలిపించారు. లొంగిపోవాలంటూ ఆయనతో చెప్పించారు. అప్పటికే ప్రాణభయంతో పొదల మాటున నక్కిన జహంగీర్‌కు తండ్రి మాట వినిపించడంతో పోయిన ప్రాణం లేచి వచ్చినట్టు అయింది. అదే సమయంలో జవాన్లు కూడా అతడి ప్రాణానికి హామీ ఇచ్చారు.

ఏమీ చేయబోమని, దేవుడి మీద, కుటుంబ సభ్యుల మీద ప్రమాణం చేసి చెబుతున్నామని, బయటకు రావాలని కోరారు. వారి మాటలు నమ్మిన జహంగీర్ తుపాకిని పక్కన పడేసి చేతులు పైకెత్తి వారి ఎదుటకు వచ్చి లొంగిపోయాడు. అనంతరం అతడిని తండ్రికి అప్పగించారు. మరోసారి ఉగ్రవాదం వైపు అతడు ఆకర్షితుడు కాకుండా చూసుకోవాలని తండ్రికి సూచించారు. తన కుమారుడిని ఎన్‌కౌంటర్ చేయకుండా తమకు అప్పగించిన జవాన్లకు జహంగీర్ తండ్రి కృతజ్ఞతలు తెలిపారు.

More Telugu News