బాలయ్య సరసన మలయాళ భామ!

17-10-2020 Sat 09:16
Prayaga Martin opposite Balakrishna in his latest flick
  • బాలకృష్ణ, బోయపాటి కాంబోలో మూడో చిత్రం 
  • రెండు పాత్రలలో కనిపించనున్న బాలయ్య 
  • యంగ్ పాత్ర సరసన ప్రయాగ మార్టిన్ ఎంపిక 
  • త్వరలో హైదరాబాదులో తాజా షెడ్యూలు  

మలయాళపు ముద్దుగుమ్మలు మొదటి నుంచీ టాలీవుడ్ లో సందడి చేస్తూనే వున్నారు. కొంతమంది ఇక్కడ స్టార్ హీరోయిన్లుగా కూడా రాణించి పలు సినిమాలలో నటించారు. ఈ క్రమంలో ఇప్పుడు మరో మల్లూ బేబీ ప్రయాగ మార్టిన్ టాలీవుడ్ రంగప్రవేశం చేస్తోంది. పైగా ఆమె స్టార్ హీరో బాలకృష్ణ సరసన నటించనుండడం విశేషం.

ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ తన మూడవ చిత్రాన్ని చేస్తున్న విషయం విదితమే. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో బాలయ్య రెండు విభిన్న పాత్రలలో కనిపిస్తారని అంటున్నారు. ఇందులో యంగ్ బాలకృష్ణ సరసన తాజాగా ప్రయాగ మార్టిన్ ను ఎంపిక చేసినట్టు సమాచారం. మలయాళ చిత్రాలతో పాటు కన్నడ, తమిళ చిత్రాలలో కూడా ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది.

ఇదిలావుంచితే, 'సింహా', 'లెజెండ్' చిత్రాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి కలయికలో వస్తున్న ఈ చిత్రం షూటింగ్ కొంత భాగం లాక్ డౌన్ కి ముందు జరిగింది. ఇప్పుడు తదుపరి షెడ్యూలును ఈ నెలలోనే హైదరాబాదులో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ షెడ్యూలులో కథానాయిక ప్రయాగ మార్టిన్ కూడా జాయిన్ అవుతుందట.