క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన పాక్ పేసర్ ఉమర్ గుల్

17-10-2020 Sat 08:47
pakistan cricketer umar gul announces retirement to all formats
  • అన్ని పార్మాట్ల నంచి తప్పుకున్నట్టు ప్రకటించిన గుల్
  • తన దేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు గర్వంగా ఉందని పేసర్
  • 2008 సీజన్‌లో ఐపీఎల్‌లో కోల్‌కతాకు ప్రాతినిధ్యం

పాకిస్థాన్ క్రికెటర్ ఉమర్ గుల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించిన 36 ఏళ్ల గుల్.. ఇన్నేళ్లుగా తన దేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు గర్వంగా ఉందన్నాడు. తాను క్రికెట్ నుంచి ఎంతో నేర్చుకున్నానని, ముఖ్యంగా నిబద్ధత, కృషి, సంకల్పం, విలువలు వంటివి క్రికెట్ తనకు నేర్పిందన్నాడు. ఇన్నేళ్ల తన ప్రయాణంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు చెప్పాడు. తన కోసం ఎంతో త్యాగం చేసిన అభిమానులే తనకు స్ఫూర్తి అని, ఇక నుంచి వారిని మిస్ అవుతానని పేర్కొన్నాడు.

జింబాబ్వేతో 2003లో జరిగిన మ్యాచ్‌తో వన్డేల్లో అడుగుపెట్టిన ఈ పేసర్ అదే ఏడాది బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. గుల్ ఇప్పటి వరకు 130 వన్డేల్లో 179 వికెట్లు పడగొట్టగా, 47 టెస్టుల్లో 163, 60 టీ20ల్లో 85 వికెట్లు తీసుకున్నాడు. 2016లో పాక్ తరపున చివరి టీ20 ఆడిన గుల్.. 2008 సీజన్‌లో ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.