kathi karthika: టీవీ యాంకర్ కత్తి కార్తీకపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

Cheating case against tv anchor kathi karthika in banjara hills police station
  • తనది కాని భూమిని రూ.35 కోట్లకు విక్రయిస్తామని మోసం
  • బంజారాహిల్స్ పోలీసులకు రియల్టర్ ఫిర్యాదు
  • కార్తీకతోపాటు ఆరుగురిపై కేసు నమోదు
టీవీ యాంకర్ కత్తి కార్తీకపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్‌కు చెందిన టచ్‌స్టోన్ ప్రాపర్టీ డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ఎండీ దొరస్వామి, టీంవన్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ఎండీ శ్రీధర్ గోపిశెట్టి ఇద్దరూ మంచి స్నేహితులు. తన సంస్థను మరింత విస్తరించాలనుకుంటున్నానని, ఎక్కడైనా భూమి ఉంటే చూసిపెట్టాలని స్నేహితుడు శ్రీధర్‌ను దొరస్వామి కోరారు.

తనకు కత్తి కార్తీక ఆధ్వర్యంలోని కార్తీక గ్రూపుతోపాటు తనకు తెలిసిన వ్యాపారులకు చెప్పి భూమిని చూపించే ప్రయత్నం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ క్రమంలో కత్తి కార్తీక, నువ్వాల శివరాం, తెన్నేరి భీమ్‌సేన్ తదితరులు ఏప్రిల్‌లో దొరస్వామిని కలిసి మెదక్ జిల్లా అమీన్‌పూర్‌లో 52 ఎకరాల స్థలంలో తమకు కొంత వాటా ఉందని చెప్పారు. ఈ భూమికి సంబంధించి డెవలప్‌మెంట్ అగ్రిమెంటుతోపాటు స్థలానికి సంబంధించి అన్ని పత్రాలు ఉన్నాయని నమ్మబలికారు. రూ. 35 కోట్లకు విక్రయిస్తామని, కోటి రూపాయలు అడ్వాన్స్ ఇవ్వాలని సూచించారు.

వారిని విశ్వసించిన దొరస్వామి కత్తి కార్తీకతోపాటు ఇతరుల ఖాతాల్లోకి ఆ మొత్తాన్ని బదిలీ చేశారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసిన దొరస్వామి నిర్ఘాంతపోయారు. తనకు అమ్మాలని చూసిన భూమి వారిది కాదని, సిప్లా రమేశ్ అనే వ్యక్తిదని తెలియడంతో దొరస్వామి ఆయనను కలిశారు.

 ఈ భూమితో కత్తి కార్తీకకుగానీ, ఇతరులకు కానీ ఎటువంటి సంబంధం లేదని, రూ. 80 కోట్లు ఇస్తేనే స్థలాన్ని విక్రయిస్తానని చెప్పడంతో తాను మోసపోయినట్టు దొరస్వామి గుర్తించి నిన్న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కత్తి కార్తీకతోపాటు ఆరుగురిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
kathi karthika
Cheating case
realter
Banjara hills
tv anchor

More Telugu News