హైదరాబాద్ మెట్రోకు లాక్‌డౌన్ కష్టాలు.. ఆరు నెలల్లో రూ. 916 కోట్ల నష్టం

17-10-2020 Sat 07:33
Hyderabad metro rail suffers with huge loss amid lockdown
  • సుదీర్ఘ లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన మెట్రో సేవలు
  • తొలి ఆరు నెలల్లో కార్యకలాపాల ద్వారా రూ. 60 కోట్ల ఆదాయం
  • గత ఆర్థిక సంవత్సరంలో రూ. 383 కోట్ల నష్టం

కరోనా మహమ్మారి హైదరాబాద్ మెట్రోకు భారీ నష్టాలు మిగిల్చింది. కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన సుదీర్ఘ లాక్‌డౌన్ కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో దారుణ నష్టాలు చవిచూసింది. ఏకంగా రూ.916 కోట్ల మేర నష్టాలు మూటగట్టుకుంది. ఈ మేరకు ఎల్‌అండ్‌టీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ వెల్లడించింది.

తొలి ఆరు నెలల కాలంలో కార్యకలాపాల ద్వారా రూ. 60 కోట్లు మాత్రమే సమకూరినట్టు పేర్కొంది. కాగా, గత ఆర్థిక సంవత్సరంలోనూ మెట్రో భారీ నష్టాలు చవిచూసింది. అప్పట్లో రూ.383 కోట్ల మేర నష్టపోయింది. కరోనా కారణంగా నిలిచిపోయిన మెట్రో సేవలు గత నెల ఏడో తేదీ నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి.