విష్ణు 'మోసగాళ్లు'కు వెంకటేశ్ మాట సాయం!

16-10-2020 Fri 21:34
Venkatesh voice over for Vishnus film
  • జెఫ్రీ దర్శకత్వంలో 'మోసగాళ్లు' 
  • ఐటీ పరిశ్రమలో జరిగిన స్కామ్ నేపథ్యం
  • విష్ణు సోదరి పాత్రలో కాజల్ అగర్వాల్
  • వెంకటేశ్ కి థ్యాంక్స్ చెప్పిన విష్ణు  

ఒక హీరో సినిమాకు మరో హీరో వాయిస్ ఓవర్ చెప్పడమనేది మనం అప్పుడప్పుడు మన సినిమాలలో చూస్తుంటాం. ఆయా హీరోల మధ్య వుండే అనుబంధాలకు తార్కాణంగా ఇవి నిలుస్తుంటాయి. ఇలా మరో స్టార్ హీరో వాయిస్ ఓవర్ చెప్పడం వల్ల తమ సినిమాకు క్రేజ్ పెరుగుతుందని భావిస్తుంటారు. అలాగే ఇప్పుడు మంచు విష్ణు నటిస్తున్న సినిమాకు వెంకటేశ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.

జెఫ్రీ జీ చిన్ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో 'మోసగాళ్లు' పేరిట ఓ భారీ చిత్రం రూపొందుతోంది. అమెరికాలో ఐటీ పరిశ్రమలో చోటుచేసుకున్న ఓ భారీ కుంభకోణం నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది. ఇందులో అర్జున్ అనే యువకుడి పాత్రలో విష్ణు నటిస్తుండగా, అతని సోదరిగా అను పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఈ చిత్రానికే వెంకటేశ్ వాయిస్ ఓవర్ చెప్పారు.

ఈ విషయం గురించి విష్ణు ఈ రోజు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ వెంకీకి థ్యాంక్స్ చెప్పాడు. చిత్రకథ సాగే క్రమంలో వెంకటేశ్ వాయిస్ ఓవర్ వస్తుందని తెలుస్తోంది. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఇందులో కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ చిత్రాన్ని తమిళ, కన్నడ, హిందీ భాషల్లోకి కూడా అనువదిస్తున్నారు. అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు పలువురు దీనికి పనిచేస్తున్నారు.