వరదకు కొట్టుకుపోయి మరణించిన హైదరాబాద్ వాసి... కలచివేస్తున్న చివరి ఫోన్ కాల్!

16-10-2020 Fri 21:05
Hyderabad man last phone call to friend after he caught up in flood
  • కుంభవృష్టితో హైదరాబాదులో వరదలు
  • కారుతో సహా వరదలో చిక్కుకున్న వెంకటేశ్ గౌడ్
  • సాయం కోసం స్నేహితుడికి ఫోన్ కాల్

కుండపోత వర్షంతో హైదరాబాద్ నగరం వరదల్లో చిక్కుకోవడం తెలిసిందే. ఈ వరదల్లో భారీగా ప్రాణనష్టం జరిగింది. కాగా, వెంకటేశ్ గౌడ్ అనే వ్యక్తి కూడా కారుతో సహా వరదకు కొట్టుకుపోయి శవమై తేలాడు. వెంకటేశ్ గౌడ్ తన మిత్రుడితో చివరిగా మాట్లాడిన కాల్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో అందరినీ కలచివేస్తోంది. తన కారు బలమైన నీటి ప్రవాహంలో చిక్కుకుపోయిందని, సాయం చేసేందుకు ఎవరినైనా పంపించాలని వెంకటేశ్ గౌడ్ ఫోన్ కాల్ ద్వారా తన మిత్రుడ్ని కోరాడు.

ప్రస్తుతం తన కారును ముందుకు కొట్టుకుపోకుండా ఓ చెట్టు ఆపిందని, టైర్లు పూర్తిగా మునిగిపోయాయని, కారులోకి కూడా నీరు వచ్చేస్తోందని తెలిపాడు. దాంతో అతని స్నేహితుడు ఆందోళన చెందుతూ... దగ్గర్లో ఏమైనా గోడలు, చెట్లు ఉంటే ఎక్కాలని సూచించాడు.

అయితే దగ్గర్లో ఓ గోడ కనిపిస్తోందని, కానీ తాను కారులోంచి బయటికి వస్తే వరద ఉద్ధృతికి కొట్టుకుపోవడం ఖాయమని వెల్లడించాడు. కారు కొద్దికొద్దిగా కదిలిపోతోందని భయంతో చెప్పాడు. "భయపడవద్దు, నీకు ఏమీ కాదు" అని ఆ మిత్రుడు వెంకటేశ్ గౌడ్ కు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు. అంతటితో ఆ కాల్ ముగిసింది. దురదృష్టవశాత్తు వెంకటేశ్ గౌడ్ కారు వరద తీవ్రతకు కొట్టుకుపోయింది. విషాదకర రీతిలో వెంకటేశ్ గౌడ్ మృత్యువాత పడ్డాడు.