రఘురామకృష్ణరాజుపై వేటు... సబార్డినేట్ లెజిస్లేచర్ కమిటీ చైర్మన్ గా ఎంపీ బాలశౌరి నియామకం

16-10-2020 Fri 19:58
MP Bala Showry appointed as parliamentary committee chairman
  • లోక్ సభ స్పీకర్ ప్రకటన
  • వైసీపీ పార్లమెంటరీ పార్టీ విజ్ఞప్తుల మేరకు నిర్ణయం
  • ఇటీవల తిరుగుబాటు గళం వినిపిస్తున్న రఘురామ

పార్లమెంటు కమిటీలకు సంబంధించి ఢిల్లీలో ఆసక్తికర పరిణామాలు సంభవించాయి. పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేచర్ కు చైర్మన్ గా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును తప్పించారు. రఘురామకృష్ణరాజు స్థానంలో ఎంపీ బాలశౌరికి పదవి అప్పగిస్తూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఓ ప్రకటన చేశారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ ఇటీవల చేసిన పలు విజ్ఞప్తుల మేరకు స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఎంపీ రఘురామకృష్ణరాజు గతకొంతకాలంగా వైసీపీ అధినాయకత్వంపై తిరుగుబాటు ధోరణి కనబరుస్తున్నారు. నేరుగా సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి వంటి పెద్దలను టార్గెట్ చేస్తూ పార్టీకి కంట్లో నలుసులా మారారు. దాంతో ఆయనను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి నుంచి తప్పించడంలో వైసీపీ సఫలమైంది.

కాగా, దీనిపై  రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ.. ఆ పదవియొక్క కాలం ఒక సంవత్సరం మాత్రమే. నా పదవీకాలం ముగియడం వలన.. వైసీపీ పార్లమెంటరీ పార్టీ  విజ్ఞప్తుల మేరకు ఆ పదవిలో బాలశౌరిని నియమించారు. అంతేకాని నన్నెవరూ పీకలేదు.. నన్నెవరూ పీకలేరు అని చెప్పారు.