వరదలు వచ్చినా సాగునీరు ఇవ్వలేని పరిస్థితిలో జగన్ ఉన్నారు: టీడీపీ నేత జవహర్

16-10-2020 Fri 17:42
Jagan is iron leg says Jawahar
  • జగన్ సీఎం అయినప్పటి నుంచి రాష్ట్రానికి అరిష్టం చుట్టుకుంది
  • ఒక్క రోజైనా జనాలు ప్రశాంతంగా ఉన్నారా?
  • వరద బాధితులను తక్షణమే ఆదుకోవాలి

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ది ఐరన్ లెగ్ అని, దరిద్ర పాదమని మండిపడ్డారు. వైసీపీ 17 నెలల పాలనలో రాష్ట్ర ప్రజలు ఒక్క రోజైనా ప్రశాంతగా ఉన్నారా? అని ప్రశ్నించారు. జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రాష్ట్రానికి అరిష్టం చుట్టుకుందని దుయ్యబట్టారు.

భారీ వరదలతో ప్రజలు అవస్థలు పడుతుంటే... జగన్ వల్లే వర్షాలు పడుతున్నాయని చెప్పడానికి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు సిగ్గుండాలని అన్నారు. వరదలు వచ్చినా సాగునీరు ఇవ్వలేని పరిస్థితిలో జగన్ ఉన్నారని విమర్శించారు. వరద బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.