'ఆదిపురుష్'లో కృతి సనన్.. సీత పాత్రకు పరిశీలన?

16-10-2020 Fri 17:40
Kruti Sanon is considered for Adipurush film
  • ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్'
  • రామాయణం ఆధారంగా సాగే కథ
  • రాముడిగా ప్రభాస్.. రావణ్ గా సైఫ్ 
  • శివుడి పాత్రకు అజయ్ దేవగణ్?   

ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలలో 'ఆదిపురుష్'కి ఓ ప్రత్యేకత వుంది. ఇది ప్రభాస్ చేస్తున్న తొలి డైరెక్ట్ హిందీ సినిమా. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో వహించే ఈ చిత్రం రామాయణం ఆధారంగా రూపొందుతుంది. దీంతో ఇందులో ప్రభాస్ రాముడి పాత్రను, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణ్ పాత్రను పోషిస్తున్నారు.

ఇక కథలో ముఖ్యమైన సీత పాత్రను ఎవరు పోషిస్తారన్నది మొదటి నుంచీ సస్పెన్సుగా వుంది. కీర్తి సురేశ్ నటిస్తుందని, కాదు, అనుష్క శర్మ నటిస్తుందని, అంతలోనే కైరా అద్వానీ అంటూ ఇప్పటికే కొన్ని పేర్లు ప్రచారంలోకి వచ్చినప్పటికీ.. వాటిలో ఏమాత్రం నిజం లేదని చిత్రం యూనిట్ ఖండించింది.

ఈ క్రమంలో తాజాగా సీత పాత్రకు బాలీవుడ్ నటి కృతి సనన్ పేరు ప్రచారంలోకి వచ్చింది. ఆమె పేరును దర్శక నిర్మాతలు ప్రస్తుతం సీరియస్ గా పరిశీలిస్తున్నారని బాలీవుడ్ లో వార్తలొస్తున్నాయి. ప్రభాస్ పక్కన కృతి అయితే పర్సనాలిటీ పరంగా కూడా సరిపోతుందని అంటున్నారు. ఈ విషయంలో త్వరలో క్లారిటీ వస్తుంది.  

ఇదిలావుంచితే, ఇందులో మరో కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ నటించే అవకాశం వుందనే వార్తలు కూడా గత కొంత కాలంగా వినిపిస్తున్నాయి. ఇందులో శివుడి పాత్రను ఆయన పోషిస్తాడని అంటున్నారు.