ఆ వ్యాఖ్యలకు సారీ చెప్పకపోతే జగన్ పదవీచ్యుతుడవడం ఖాయం: రఘురామకృష్ణరాజు

16-10-2020 Fri 17:37
Raghurama Krishnaraju comments on CM Jagan
  • ఢిల్లీలో రఘురామ రచ్చబండ
  • కోర్టుపై చేసిన వ్యాఖ్యలు జగన్ ను వదలవని వెల్లడి
  • దొంగ వెధవల్లారా అంటూ ట్రోలర్లపై ఆగ్రహం

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఢిల్లీలో ఇవాళ కూడా రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్ కేసులపై హైదరాబాదు సీబీఐ కోర్టులో విచారణ షురూ అవుతోందని, ఇకపై జగన్ హైదరాబాదులోనే ఉండాల్సి రావొచ్చని అన్నారు. ఈ కేసుల నుంచి జగన్ బయటపడొచ్చని అనుకున్నా, ఆయన ఇటీవల కోర్టుపై చేసిన వ్యాఖ్యల నుంచి మాత్రం తప్పించుకోలేరని స్పష్టం చేశారు.

తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెబితే ఆయన పదవి నిలుస్తుందని, లేకపోతే పదవీచ్యుతుడవడం ఖాయమని అభిప్రాయపడ్డారు. జగన్ కు ఒకరోజు శిక్ష పడినా సీఎం పదవి పోతుందని రఘురామకృష్ణరాజు వివరించారు. ఈ పరిస్థితుల్లో తనను తాను మాత్రమే కాపాడుకోగలరని, మరి ఆయనకు తనను తాను కాపాడుకోవడంపై ఆసక్తి ఉందో లేదో తెలియదని వ్యాఖ్యానించారు. పక్కనున్న దొంగవెధవలు ఆయనను తనను తాను కాపాడుకోనిస్తారా? అనేది సందేహమేనని రఘురామ పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో కొందరు దరిద్రులు ఉన్నారని, ప్రెస్ మీట్ చెట్టుకింద కాకపోతే కుప్పతొట్టి పక్కన పెట్టుకోరా అని తనపై విమర్శలు చేస్తున్నారని వెల్లడించారు. అలాంటి వాళ్లను పందులతో పోల్చిన రఘురామ... జగన్ పదవి పోగొట్టుకునే దాకా ఇలాగే అనండ్రా వెధవల్లారా, ఇలాంటి పనికిమాలిన పోస్టులు కాదురా దరిద్రుల్లారా! అంటూ మండిపడ్డారు.