మీ ఆరేళ్ల పాలనలో ఏమాత్రం చిత్తశుద్ధితో సేవ చేసినా ఇంత నష్టం జరిగేది కాదు: సీఎం కేసీఆర్ పై విజయశాంతి ధ్వజం

16-10-2020 Fri 17:14
Vijayasanthi take a dig at CM KCR over twin cities worst situation
  • భారీ వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలం
  • ప్రజలు నిస్సహాయ స్థితిలో చిక్కుకున్నారన్న విజయశాంతి
  • కేసీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు

అతి భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం అతలాకుతలం అయిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేత విజయశాంతి సీఎం కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. జంట నగరాల్లో ఈ ఏడాది ఇప్పటివరకు కురిసిన భారీ వర్షాలు ప్రజల్ని ఎప్పుడూ లేనంత నిస్సహాయ స్థితిలోకి నెట్టివేయడం కళ్లారా చూశామని వ్యాఖ్యానించారు. వీధుల్లో వరదనీరు కాలువల్లా పారిందని, రోడ్లపై ఏరులా ప్రవహించిందని తెలిపారు. ఈ దౌర్భాగ్యానికి గత పాలకులే కారణమని సీఎం కేసీఆర్ దొరగారు ఎన్నోమార్లు నినదించారని విజయశాంతి వెల్లడించారు.  

ప్రకృతిని నియంత్రించడం ఎవరి వల్ల కాదని, అయితే, చినుకు పడితే చాలు చెదిరిపోయే జంటనగర ప్రజలను వరద కష్టాల నుంచి రక్షించేందుకు గడచిన ఆరేళ్ల పరిపాలన కాలంలో సీఎం కేసీఆర్ ఏంచేశారని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ ఏ కాస్త అయినా చిత్తశుద్ధితో సేవ చేసి ఉంటే ఇంత నష్టం జరిగి ఉండేది కాదని విమర్శించారు. కేసీఆర్ సరైన పాలన అందించి ఉంటే ప్రజలు తక్కువ ఇబ్బందులతో గట్టెక్కేవాళ్లని తెలిపారు. సర్కారు పాలనా పగ్గాలు అందుకున్న మొదటి, మలి విడతల పాలనా కాలంలో ఇలాంటి పరిస్థితుల నుంచి పౌరులను రక్షించేందుకు ఏ పరిష్కారాలు చూపించారో కేసీఆర్ తనను తాను ప్రశ్నించుకోవాలని విజయశాంతి పేర్కొన్నారు.

"టీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు ఎన్నెన్నో చెరువుల దురాక్రమణలు, భూ కబ్జాలు, అక్రమ నిర్మాణాలు చోటుచేసుకున్నాయని కేసీఆర్ అనేక పర్యాయాలు అన్నారు. దాని వల్ల జరిగిందేమిటి? మీరైనా ఈ పరిస్థితులకు అడ్డుకట్ట వేయగలిగారా? మీ నిర్వహణ ఏ తీరున ఉందో జలగండంలో చిక్కుకుపోయిన మీ కలల విశ్వనగరాన్ని చూస్తే చాలు" అని వ్యాఖ్యానించారు.