తల బెంగళూరులో.... మొండెం మధ్యప్రదేశ్ లో..!

16-10-2020 Fri 16:55
Head entangled in Rajadhani express train engine after torso recovered at Betul
  • బేతుల్ వద్ద లభ్యమైన మొండెం
  • రాజధాని ఎక్స్ ప్రెస్ ఇంజిన్ లో చిక్కుకుపోయిన తల
  • బెంగళూరులో గుర్తించిన రైల్వే సిబ్బంది

మధ్యప్రదేశ్ లోని బేతుల్ ప్రాంతంలో ఓ వ్యక్తి మొండెం మాత్రమే లభ్యమైన ఘటన కలకలం రేపింది. రైలు పట్టాల పక్కన పడివున్న మృతదేహానికి తల లేకపోగా, మరికొన్ని అవయవాలు కూడా గల్లంతయ్యాయి. బేతుల్ సమీపంలోని మచ్నా బ్రిడ్జి వద్ద అక్టోబరు 3న ఈ మేరకు పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

కాగా, ఆ మృతదేహం తలభాగం బేతుల్ కు 1,300 కిలోమీటర్ల దూరంలోని బెంగళూరులో లభ్యమైంది. రాజధాని ఎక్స్ ప్రెస్ ఇంజిన్ లో చిక్కుకుని ఉన్న తలను రైల్వే సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆ తల బేతుల్ వద్ద లభ్యమైన మొండేనిది అని తేలింది. న్యూఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లే రాజధాని ఎక్స్ ప్రెస్ ఢీకొనడం వల్లే ఆ వ్యక్తి మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

మరణించిన వ్యక్తిని రవి మర్కమ్ (28)గా గుర్తించారు. అయితే రవి కుటుంబసభ్యులకు బెంగళూరు వెళ్లేంత ఆర్థిక స్తోమత లేకపోవడంతో బెంగళూరు పోలీసులు అతడి తలను అక్కడే ఖననం చేశారు. బేతుల్ లో లభ్యమైన మొండేన్ని మాత్రం అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులకు అప్పగించారు.