బాలీవుడ్ ను తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు... అది జరగని పని: సీఎం ఉద్ధవ్ థాకరే

16-10-2020 Fri 16:29
CM Udhav Thackeray says they won not tolerate Bollywood shifting trials
  • సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్ యాజమాన్యాలతో ఉద్ధవ్ భేటీ
  • మీడియా బాలీవుడ్ ను టార్గెట్ చేసిందని ఆరోపణ
  • బాలీవుడ్... ప్రపంచానికే వినోదాన్ని అందిస్తోందని వెల్లడి

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే తాజా పరిణామాలపై స్పందించారు. సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్ ల యజమానులతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బాలీవుడ్ ను ఇక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని... అలాంటి ప్రయత్నాలను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వ్యవహారంలో మీడియా బాలీవుడ్ ను లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. కొన్నిరోజులుగా బాలీవుడ్ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతుండడం బాధాకరమని అన్నారు. ముంబయి దేశ ఆర్థిక రాజధాని మాత్రమే కాదని, వినోదానికి కేంద్రం అని అభిప్రాయపడ్డారు.

అయితే, ఇటీవల కొన్ని పరిణామాలు చిత్రపరిశ్రమ పేరును దిగజార్చేలా ఉన్నాయని తెలిపారు. బాలీవుడ్ భారత్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వినోదాన్ని అందిస్తోందని, విస్తృతస్థాయిలో ఉపాధి కల్పిస్తోందని అన్నారు. కొన్ని వర్గాలు బాలీవుడ్ ను అంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని, అది జరగని పని అని ఉద్ధవ్ థాకరే స్పష్టం చేశారు.