భారతీయుల సగటు ఆయుర్దాయంపై లాన్సెట్ జర్నల్ ఆసక్తికర కథనం

16-10-2020 Fri 15:54
Lancet Journal says Indians mean life time increased
  • సగటు ఆయుర్దాయం పెరిగిందని వెల్లడి
  • 90వ దశకంలో భారత ప్రజల ఆయుర్దాయం 59.6 ఏళ్లు
  • 2019 నాటికి 70.8 ఏళ్లకు చేరిందన్న లాన్సెట్ జర్నల్

ప్రపంచ ప్రఖ్యాత వైద్య పత్రిక లాన్సెట్ జర్నల్ భారతీయుల ఆయుర్దాయంపై ఆసక్తికర అంశాలు వెల్లడించింది. భారతదేశ ప్రజల సగటు ఆయుర్దాయం 70.8 ఏళ్లకు పెరిగిందని తన తాజా నివేదికలో తెలిపింది. 90వ దశకంలో భారతీయుల సగటు ఆయుష్షు 59.6గా ఉందని, 2019 నాటికి అది గణనీయంగా పెరిగిందని వివరించింది.

అయితే, భారత్ లోని వివిధ రాష్ట్రాల ప్రజల సగటు ఆయుష్షులో మాత్రం ఎత్తుపల్లాలు ఉన్నాయని లాన్సెట్ పేర్కొంది. కేరళలో సగటు జీవితకాలం 77.3 ఏళ్లకు పెరగ్గా, యూపీలో ఓ వ్యక్తి సగటు ఆయుష్షు 66.9 అని తెలిపింది.

లాన్సెట్ నివేదికపై స్పందించిన ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భారతీయుల సగటు ఆయుర్దాయం పెరిగినప్పటికీ వారు సంతోషంగా జీవిస్తున్నట్టు భావించలేమని, వారు అనేక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారని వెల్లడించించింది. భారత ప్రజలు అనుకున్నంత ఆరోగ్యంగా లేరని స్పష్టం చేసింది.