Muttiah Muralitharan: 'ముత్తయ్య మురళీధరన్ ఇండియా ద్రోహి' అంటూ భారతీ రాజా తీవ్ర విమర్శలు

  • మురళీధరన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం
  • శ్రీలంక మతవాదానికి మురళి మద్దతు పలికాడన్న భారతీరాజా
  • ఆ పాత్రలో నటించవద్దని విజయ్ సేతుపతికి సూచన
Bharathi Raja criticises Muttaiah Muralitharan

ప్రపంచ క్రికెట్ చరిత్రలో శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ ది ఒక సువర్ణాధ్యాయం. అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో ఘనతలను సొంతం చేసుకుని, పలు రికార్డులను తన పేరు మీద లిఖించుకున్నాడు. టెస్టుల్లో 800, వన్డేల్లో 534 వికెట్లను పడగొట్టి దిగ్గజ బౌలర్ గా చరిత్రపుటల్లో నిలిచాడు.

తమిళ సంతతి శ్రీలంక జాతీయుడైన మురళీధరన్ జీవిత చరిత్రతో ఇప్పుడు ఓ సినిమా తెరకెక్కుతోంది. కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి మురళీధరన్ పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమాకు '800' అనే టైటిల్ ని ఎంపిక చేశారు. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇటీవలే చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఎంఎస్ శ్రీపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా... వివేక్ రంగచారి నిర్మిస్తున్నారు.

మరోవైపు ఈ సినిమాపై పలువురు తమిళులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీలంకలోని తమిళులను ఆ దేశ ప్రభుత్వం అణచివేస్తోందని... జాతి వివక్షకు పాల్పడుతున్న దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రికెటర్ జీవితాన్ని ఎలా తెరకెక్కిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు.

 ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా కూడా ఈ చిత్రంపై మండిపడ్డారు. మురళీధరన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శ్రీలంక మతవాదానికి మురళీధరన్ కూడా మద్దతు పలికాడని... ఇండియాకు నమ్మకద్రోహిగా మిగిలిపోయాడని ఆయన విమర్శించారు. అలాంటి వ్యక్తి బయోపిక్ లో విజయ్ సేతుపతి నటించడం సరికాదని అన్నారు.

More Telugu News