విజయవాడ ప్రేమోన్మాది ఘాతుకం చాలా బాధాకరం: డీజీపీ గౌతమ్ సవాంగ్

16-10-2020 Fri 15:07
DGP Gowtham Sawang responds to Vijayawada incident
  • విజయవాడలో దివ్య తేజస్విని అనే యువతి హత్య
  • బాధితురాలి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపిన డీజీపీ
  • సీపీ పర్యవేక్షణలో దర్యాప్తు సాగుతుందని వెల్లడి

విజయవాడ క్రీస్తురాజపురానికి చెందిన దివ్య తేజస్విని అనే యువతిపై పెయింటింగ్ పనులు చేసుకునే నాగేంద్రబాబు అనే యువకుడు దాడి చేసి అంతమొందించిన ఘటనపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. విజయవాడలో ప్రేమోన్మాది ఘాతుకం బాధాకరమని అన్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు.

ఉన్మాద చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, చిన్నారులు, మహిళలపై దాడులు చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వింత పోకడలను అరికట్టాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పేర్కొన్నారు. ఈ ఘటనపై సీపీ స్వీయ పర్యవేక్షణలో దర్యాప్తు జరిగేలా ఆదేశాలు జారీ చేసినట్టు గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. 'దిశ' స్ఫూర్తిగా ఏడు రోజుల్లో చార్జిషీటు దాఖలు చేస్తామని తెలిపారు.