ఆత్మ నిర్భర్ భారత్ దిశగా కేంద్రం కీలక నిర్ణయం... ఏసీల దిగుమతిపై నిషేధం

16-10-2020 Fri 14:52
Centre bans imort of Air Conditioners
  • దేశీయ తయారీ రంగానికి ప్రోత్సాహం
  • ఇప్పటికే కలర్ టీవీల దిగుమతిపై నిషేధం
  • 30 శాతం ఏసీలను దిగుమతి చేసుకుంటున్న భారత్

ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చిన మేరకు ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ లో భాగంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి ఏసీల దిగుమతిపై నిషేధం ప్రకటించింది. దేశంలో ఏసీ యంత్రాల తయారీని ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.  ఈ మేరకు కేంద్ర విదేశీ వాణిజ్య విభాగం డైరెక్టర్ జనరల్ ఓ ప్రకటన విడుదల చేశారు.

భారత్ దాదాపు 30 శాతం ఏసీలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోందని, సాధ్యమైనంత తక్కువ సమయంలో ఈ దిగుమతిని తగ్గించుకునేందుకు ప్రయత్నించాలని ఆ ప్రకటనలో కోరారు. అత్యవసరమైనవి తప్ప ఇతర వస్తువుల దిగుమతులను భారత్ క్రమంగా తగ్గిస్తోంది. స్వావలంబన సాధించడం, దేశీయ తయారీ రంగాన్ని అభివృద్ధి చేయడం మోదీ సర్కారు ముఖ్య లక్ష్యం. ఈ క్రమంలో ఆత్మ నిర్భర్ అభియాన్ ను ప్రకటించారు. ఇందులో భాగంగా పలు రకాల కలర్ టీవీలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడంపై ఇప్పటికే నిషేధం విధించారు.