డ్రగ్స్ కేసు.. నటుడు వివేక్ ఒబెరాయ్ భార్యకు నోటీసులు

16-10-2020 Fri 14:43
CCS police serves notices to Vivek Oberaois wife
  • డ్రగ్స్ కేసులో వివేక్ ఒబెరాయ్ బావమరిది ఆదిత్య
  • వివేక్ భార్య సోదరుడే ఆదిత్య
  • ఆదిత్య కోసం వెతుకుతున్న పోలీసులు

బాలీవుడ్ తో పాటు కన్నడ సినీ పరిశ్రమను డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తోంది. రెండు పరిశ్రమలకు సంబంధించి ఇప్పటికే పలువురు విచారణ ఎదుర్కొన్నారు. కొందరు ఊచలు కూడా లెక్కబెడుతున్నారు. మరోవైపు బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ముంబై నివాసంలో బెంగళూరు పోలీసులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

కర్ణాటక మాజీ మంత్రి, దివంగత జీవరాజ్ అల్వా కుమారుడు ఆదిత్య అల్వా డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. పరారీలో ఉన్న ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివేక్ ఒబెరాయ్ భార్య ప్రియాంక అల్వా సోదరుడే ఆదిత్య. ఈ నేపథ్యంలో ఆదిత్య కోసం వివేక్ నివాసంలో బెంగళూరు సీసీఎస్ పోలీసులు సోదాలు నిర్వహించారు. అతని ఆచూకీ లభించకపోవడంతో ప్రియాంకకు ఈరోజు నోటీసులిచ్చారు. తన సోదరుడికి సంబంధించిన వివరాలను ఆమె నుంచి సేకరించడానికి ఆమెను విచారించనున్నారు.