వెంకటేశ్ కూడా సిద్ధం.. ఇక బ్రేక్ లేకుండా 'నారప్ప' షూటింగ్!

16-10-2020 Fri 14:34
Venkatesh to join Narappa shoot soon
  • టాలీవుడ్ లో షూటింగుల సందడి షురూ 
  • శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకీ 'నారప్ప'  
  • లాక్ డౌన్ కి ముందు 75 శాతం పూర్తి
  • నవంబర్ మొదటి వారం నుంచి షూటింగ్

లాక్ డౌన్ విరామం అనంతరం టాలీవుడ్ లో షూటింగుల సందడి మొదలైంది. ఆయా నిర్మాతలు పలు జాగ్రత్తలు తీసుకుంటూ తమ సినిమాల షూటింగులను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు స్టార్ హీరోలు సైతం కరోనా భయాలను పక్కన పెట్టి షూటింగులకు హాజరవుతున్నారు. అలాగే ప్రముఖ కథానాయకుడు వెంకటేశ్ కూడా షూటింగుకి రెడీ అవుతున్నారు.

తమిళంలో హిట్టయిన 'అసురన్' ఆధారంగా తెలుగులో వెంకటేశ్ హీరోగా 'నారప్ప' చిత్రం రూపొందుతోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ లాక్ డౌన్ కి ముందుగానే 75 శాతం వరకు పూర్తయింది. ఇప్పుడు ఆరు నెలల గ్యాప్ తర్వాత నవంబర్ మొదటి వారం నుంచి తదుపరి షూటింగును మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ షూటింగును ఇక బ్రేక్ లేకుండా సింగిల్ షెడ్యూల్ లోనే పూర్తిచేయమని వెంకటేశ్ దర్శక నిర్మాతలకు చెప్పారట. ఆ ప్రకారం షూటింగును ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇందులో వెంకటేశ్ సరసన ప్రియమణి జంటగా నటిస్తోంది. ప్రకాశ్ రాజ్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.