శింబుతో త్రిష ప్రేమాయణం.. కోలీవుడ్ లో హాట్ టాపిక్!

16-10-2020 Fri 13:29
Are Trisha and Shimbu in love
  • త్వరలో శింబు, త్రిషల పెళ్లంటూ వార్తలు 
  • అధికారికంగా ప్రకటించని తారలు 
  • సమాధానం చెప్పని శింబు తండ్రి రాజేందర్
  • గతంలో పలువురితో శింబు ప్రేమాయణం

త్రిష పెళ్లి వార్త ఒకటి కోలీవుడ్ లో ఇప్పుడు హాట్ హాట్ గా తిరుగుతోంది. కోలీవుడ్ రొమాంటిక్ హీరో శింబుతో త్రిష ప్రేమలో మునిగి తేలుతోందనీ, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారనీ విపరీతంగా ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో అయితే, ఈ ప్రచారానికి అంతేలేదు. శింబు అభిమానులు, త్రిష అభిమానులు ఈ వార్తల్ని తెగ షేర్ చేసుకుంటున్నారు. అయితే, వీరిద్దరి నుంచీ మాత్రం ఇంతవరకు దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.

మరోపక్క, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిన్న శింబు తండ్రి టి.రాజేందర్ పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ సందర్భంగా పాత్రికేయులు ఊరుకోరు కదా, శింబు, త్రిషల వివాహం వార్తల గురించి ప్రశ్నించారు. ఆయన దీనిని ఖండించనూ లేదు, అవుననీ చెప్పలేదు. పైపెచ్చు తెలివిగా మరో టాపిక్ లోకి వెళ్లిపోయారు. దీనిని బట్టి కూడా శింబు, త్రిషల ప్రేమ నిజమేనని అంటున్నారు.

ఇక, కోలీవుడ్ లో శింబు ఆన్ స్క్రీనే కాకుండా.. ఆఫ్ స్క్రీన్ లో కూడా మంచి ప్రేమికుడిగా పేరుతెచ్చుకున్నాడు. నయనతార, హన్సిక, హర్షిక, సనాఖాన్ వంటి వారితో మనవాడు ప్రేమాయణాలు నడిపినట్టు గతంలో చాలా వార్తలొచ్చాయి. మరి ఇప్పుడు త్రిషతో ప్రేమాయణం కంచికి చేరుతుందో లేదో చూడాలి!