ఈసారి గోవా ప్రయాణం నాకు అసౌకర్యమైన అనుభవాన్నిచ్చింది!: మంచు లక్ష్మి

16-10-2020 Fri 13:12
manchu lakshmi on goa toor
  • నా పుట్టినరోజుకి ఇటీవల గోవాకు వెళ్లాను
  • కరోనా నేపథ్యంలో ఈ టూర్ చాలా భయపెట్టింది
  • నా కూతురు దేనినీ తాకకుండా చూసుకోవడంపైనే దృష్టి పెట్టా

దేశంలో కరోనా వ్యాప్తి అత్యధికంగా ఉన్న విషయం తెలిసిందే. కరోనా సోకకుండా ప్రజలు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సినీ ప్రముఖులు చాలా మంది షూటింగులకు కూడా వెళ్లట్లేదు. అయితే, తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి తన కుమార్తె విద్యా నిర్వాణతో కలిసి సినీ నటి మంచు లక్ష్మీ ఇటీవల గోవాకు వెళ్లింది.

ఈ విషయంపై లక్ష్మి స్పందిస్తూ పలు వివరాలు చెప్పింది. ఈ వేడుకల్లో తన స్నేహితులు కొంతమంది పాల్గొన్నారని, కరోనా నేపథ్యంలో ఈ టూర్ తనని చాలా భయపెట్టిందని చెప్పింది. అయినప్పటికీ క్లిష్ట పరిస్థితుల్లో తన స్నేహితులు తనతో ఉన్నందుకు తాను చాలా హ్యాపీగా ఫీలయ్యానని తెలిపింది. కరోనా వ్యాప్తికి ముందు తమ వేడుకలన్నీ ఎయిర్‌పోర్ట్‌ నుంచే ప్రారంభమయ్యేవని, అయితే, కరోనా కారణంగా ఇప్పుడలా జరగట్లేదని తెలిపింది.

తన గోవా పర్యటనలో భాగంగా తన కూతురు దేనినీ తాకకుండా చూసుకోవడంపైనే తాను దృష్టి పెట్టానని చెప్పింది. ప్రయాణ సమయంలో తామిద్దరం అన్నిరకాల జాగ్రత్తలు పాటించామని వివరించింది. ఈ గోవా ప్రయాణం తనకు అసౌకర్యమైన అనుభవాన్ని అందించిందని చెప్పింది. గోవా బీచ్‌లోకి అడుగుపెట్టిన సమయంలో మాత్రం సంతోషంగా సమయాన్ని ఆస్వాదించామని చెప్పింది.