దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణానికి కృషి చేసిన జగన్ కు ధన్యవాదాలు: విజయసాయిరెడ్డి

16-10-2020 Fri 13:01
Vijayasai Reddy Thanked Jagan for his efforts in finishing Kanakadurga Flyover
  • విజయవాడ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన గడ్కరీ, జగన్
  • వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభోత్సవం
  • అందరూ ఆనందపడొచ్చన్న విజయసాయి

విజయవాడ ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు నిర్మించిన కనకదుర్గ ఫ్లైఓవర్ ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి ఏపీ ముఖ్యమంత్రి జగన్ కాసేపటి క్రితం ప్రారంభించారు. వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ నుంచి నితిన్ గడ్కరీ, తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి జగన్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తనదైన శైలిలో ట్విట్టర్ ద్వారా స్పందించారు. విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్ ఈరోజు ప్రారంభం కావడం సంతోషకరమని చెప్పారు. ఫ్లైఓవర్ నిర్మాణానికి కృషి చేసిన ముఖ్యమంత్రి గారికి, కేంద్ర పెద్దలకు, అధికారులకు ధన్యవాదాలు చెపుతున్నానని అన్నారు. 2016 కృష్ణా పుష్కరాలకు ముందే దుర్గగుడి ఫ్లైఓవర్ కట్టేస్తానని ప్రగల్భాలు పలికి, చేతకాక వదిలేసిన వారు కూడా ఆనందపడొచ్చని సెటైర్లు వేశారు.