Hyderabad: హైదరాబాద్ ను పలకరించిన భానుడు... ఇంకా చాలా ప్రాంతాలు నీటిలోనే!

  • కొనసాగుతున్న సహాయక చర్యలు
  • రిలీఫ్ క్యాంప్ లను మరిన్ని రోజులు నిర్వహిస్తాం
  • 1.50 లక్షల ఆహార పొట్లాలను పంచామన్న సోమేశ్ కుమార్
Relief Operations Continue in Hyderabad as Sun Comes Out

గత కొన్ని రోజులుగా భారీ వర్షాలతో అల్లాడిపోయిన భాగ్య నగర వాసులను నేడు భానుడు పలకరించాడు. మేఘాలన్నీ తొలగి, ఎండ కాస్తుండటంతో కాస్తంత ఉపశమనం లభించినట్లయింది. నిన్న కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు మినహా ఎక్కడా వర్షపాతం నమోదు కాలేదు. అయితే, ఇప్పటికీ పలు లోతట్టు ప్రాంతాలు వరద నీటిలోనే ఉన్నాయి. ముఖ్యంగా పాతబస్తీ, రామాంతపూర్, హబ్సీగూడ తదితర ప్రాంతాల్లో ఇళ్లల్లోకి చేరిన నీరు ఇంకా బయటకు వెళ్లలేదు.

జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రత్యేక మోటార్లను తెప్పించి, నీటిని తోడేసే పనులను చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. నీటిలో చిక్కుకుపోయిన వారికి పాలు, మంచినీరు, ఆహారాన్ని అందించే కార్యక్రమాలు చురుకుగా సాగుతున్నాయని అధికారులు తెలిపారు. నీరు కొంచెంకొంచెంగా తగ్గుతోందని, రేపటిలోగా అన్ని ప్రాంతాల్లోని నీటిని తొలగిస్తామని అధికార వర్గాలు అంటున్నాయి.

  సీఎం కేసీఆర్, పలువురు మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించి, సహాయక కార్యకలాపాలు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. మొత్తం 61 రిలీఫ్ సెంటర్లను నిర్వహిస్తున్నామని పేర్కొన్న చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్, మొత్తం 1.50 లక్షల ఆహార పొట్లాలను బాధిత కుటుంబాలకు అందించామని, అన్నపూర్ణ సబ్సిడీ ఆహారాన్ని కూడా అందిస్తున్నామని ఆయన వెల్లడించారు. రిలీఫ్ క్యాంపులు మరో రెండు మూడు రోజుల పాటు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అవసరమైతే వాటిని పొడిగిస్తామని తెలిపారు.

కాగా, హైదరాబాద్ లో గడచిన 100 సంవత్సరాల్లో రెండో అత్యధిక వర్షపాతం నమోదైన సంగతి తెలిసిందే. అప్పా చెరువుకు గండిపడటంతో, నీరు ఒక్కసారిగా బయటకు రాగా, పలువురు కొట్టుకుపోయారు. ఇంతవరకూ 61 మంది మరణించినట్టు అధికార వర్గాలు వెల్లడించగా, పలువురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదులు వస్తున్నాయి. మూసీ నదిలో ఇప్పటికీ భారీ వరద ప్రవహిస్తూ ఉండటంతో, లోతట్టు ప్రాంతాల్లోనే ఉన్న సహాయక సిబ్బంది, పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.

More Telugu News