క్షణానికో మలుపు తిరుగుతున్న తేజస్విని హత్య కేసు... తనే గొంతు కోసుకుందని నాగేంద్ర వాంగ్మూలం!

16-10-2020 Fri 12:08
Nagendra Reveles on Divya Murder Case
  • నా భార్యను అత్తమామలు దూరం చేశారు
  • ఇద్దరమూ ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాం
  • నేను స్పృహ తప్పి పడిపోయిన తరువాత ఎవరో చెయ్యి కోశారు
  • పోలీసుల విచారణలో నిందితుడు నాగేంద్ర

ఇంజనీరింగ్ చదువుతున్న దివ్య తేజస్విని హత్య కేసు క్షణానికో మలుపు తిరుగుతోంది. తానేమీ దివ్య మెడను కత్తితో కోయలేదని, తమ వివాహ బంధానికి పెద్దలు అడ్డుగా నిలవడంతో తీవ్ర మనస్తాపానికి గురై, ఇద్దరమూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నామని, కేసులో ప్రధాన నిందితుడైన నాగేంద్ర వాంగ్మూలం ఇచ్చాడు. తమ పెళ్లిని పెద్దలు అంగీకరించలేదని, తన భార్యను బలవంతంగా తీసుకెళ్లిపోయారని చెప్పాడు.

దివ్య తన గొంతును తానే కోసుకుందని, తాను కూడా అదే ప్రయత్నం చేశానని, అయితే తన ప్రాణం మాత్రం పోలేదని పోలీసు విచారణలో వెల్లడించాడు. ప్రస్తుతం నాగేంద్రకు ఆసుపత్రిలో చికిత్స జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏడు నెలల క్రితం తన భార్యను ఆమె పుట్టింటివారు తీసుకెళ్లారని, ఆపై ఎంతగా వారిని ఒప్పించేందుకు ప్రయత్నించినా వినలేదని, మూడు రోజుల క్రితం ఆమెతో మాట్లాడేందుకే ఇంటికి వెళ్లానని స్పష్టం చేశాడు.

ఎవరి గొంతును వాళ్లమే కోసుకున్నామని, ఆపై తాను స్పృహ తప్పి పడిపోయానని, తన చేతిని ఎవరు కోశారో మాత్రం తెలియడం లేదని తెలిపాడు. కాగా, వీరిద్దరి పెళ్లి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. నాగేంద్ర పెయింటర్ గా పనిచేస్తుండగా, భీమవరంలోని ఓ కాలేజీలో దివ్య తేజశ్విని ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతోంది. వీరిద్దరూ గతంలోనే వివాహం చేసుకున్నారనడానికి సాక్ష్యాలు కనిపిస్తున్నాయని, ఆ కోణంలోనే కేసును విచారిస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు.

ఇదే సమయంలో తమ బిడ్డకు వివాహం జరుగలేదని, హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు నాగేంద్ర పెళ్లి, ప్రేమ అంటూ అబద్ధాలు చెబుతున్నాడని దివ్య తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ బిడ్డను తమనుంచి దూరం చేసిన నాగేంద్రను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కేసులో దివ్య తల్లిదండ్రులను కూడా విచారిస్తామని, అందరి ఫోన్ కాల్ లిస్ట్ ను సేకరిస్తున్నామని పోలీసు అధికారులు చెప్పారు.