హత్రాస్ బాధితురాలి ఫొటోగా చనిపోయిన తన భార్య ఫొటో వాడుతున్నారంటూ కోర్టుకెక్కిన ఢిల్లీ వాసి!

16-10-2020 Fri 10:39
Man Claims Wifes Photo Being Circulated As Hathras Victim
  • ఢిల్లీ హైకోర్టులో వ్యక్తి ఫిర్యాదు
  • ఫిర్యాదును పరిశీలించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించిన న్యాయస్థానం
  • స్పందించిన ట్విట్టర్, గూగుల్

హత్రాస్ బాధిత యువతి స్థానంలో చనిపోయిన తన భార్య ఫొటోను వాడుతున్నారంటూ ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. హత్రాస్ బాధితురాలికి బదులుగా తన భార్య ఫొటో సోషల్ మీడియాలో తిరుగుతోందని ఫిర్యాదుదారు తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. స్పందించిన న్యాయస్థానం ఈ ఫిర్యాదును పరిశీలించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా జస్టిస్ నవీన్ చావ్లా మాట్లాడుతూ.. ఫిర్యాదు కనుక నిజమని తేలితే ఫేస్‌బుక్, గూగుల్, ట్విట్టర్‌లపై కేంద్రం తగు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ మంత్రిత్వ శాఖ ఈ ఫిర్యాదును పరిశీలించి, నిజమని తేలితే చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. అంతేకాదు, ఉత్తర్వు కాపీని స్వీకరించిన మూడు రోజుల్లో ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్‌కు అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని ఈ నెల 13న జారీ చేసిన ఆదేశాల్లో కోర్టు పేర్కొంది. తదుపరి విచారణను వచ్చే నెల 9కి వాయిదా వేసింది.

అలాగే, తన ఫిర్యాదుకు సంబంధించి కోర్టు ఆర్డర్ కాపీతోపాటు అవసరమైన పత్రాలను మంత్రిత్వ శాఖకు సమర్పించాలని ఫిర్యాదుదారుడిని కోర్టు సూచించింది. తప్పుడు ఫొటో సర్క్యులేట్ అవుతున్న యూఆర్ఎల్‌ను గుర్తించాలని ఆదేశించింది. ఈ ఫిర్యాదుపై స్పందించాల్సిందిగా కోరుతూ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ మంత్రిత్వ శాఖ, ట్విట్టర్, ఫేస్‌బుక్, గూగుల్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది.

ట్విట్టర్ తరపు న్యాయవాది మాట్లాడుతూ ఫిర్యాదుదారు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ)కి కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు. తప్పుడు ఫొటో షేర్ అవుతున్న యూఆర్ఎల్‌కు సంబంధించిన సమాచారాన్ని తమకు పంపితే దానిని బ్లాక్ చేయడమే కాక తమ ప్లాట్‌ఫాం నుంచి దానిని తొలగిస్తామని పేర్కొన్నారు. గూగుల్ కూడా ఇంచుమించు ఇలాగే పేర్కొంది. ఆక్షేపణీయ కంటెంట్ కలిగిన యూఆర్ఎల్‌ను తమకు పంపితే డిలీట్ చేయడం కానీ, బ్లాక్ చేయడం కానీ చేస్తామని వివరించింది.