ట్రంప్ క్యాంపెయిన్ ఖాతాను బ్లాక్ చేసిన ట్విట్టర్.. రిపబ్లికన్ సభ్యుల మండిపాటు

16-10-2020 Fri 09:27
Twitter blocks team trump twitter acount
  • ట్రంప్ ప్రత్యర్థి జో బైడెన్ కుమారుడిపై ట్రంప్ టీం వీడియో
  • ఉక్రెయిన్ కంపెనీతో లావాదేవీలపై పత్రికల్లో వచ్చిన కథనాలను జోడించిన వైనం
  • ఇది నిబంధనలకు విరుద్ధమన్న ట్విట్టర్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రచార ఖాతాను ట్విట్టర్ బ్లాక్ చేసింది. ట్రంప్ ప్రత్యర్థి, డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ కుమారుడిపై ట్రంప్ బృందం ఓ వీడియోను రూపొందించి పోస్టు చేసింది. ఉక్రెయిన్ ఇంధన కంపెనీతో బైడెన్ తనయుడి వ్యాపార లావాదేవీలపై పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఈ వీడియోను రూపొందించారు. అయితే, ఈ ఆరోపణలు నిజం కాదని, లావాదేవీల్లో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోలేదని రిపబ్లికన్ సారథ్యంలోని సెనేట్ కమిటీలు నిగ్గు తేల్చాయి.

ఈ వీడియోపై ట్విట్టర్ కూడా తీవ్రంగా స్పందించింది. ప్రైవేటు సమాచారాన్ని పోస్టు చేయడం, హ్యాక్డ్ మెటీరియల్స్‌పై కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో టీం ట్రంప్, వైట్‌హౌస్ ప్రెస్ కార్యదర్శి  కైలీ మెక్‌నానీ, న్యూయార్క్ పోస్టుల ఖాతాలను తాత్కాలికంగా నిలిపివేసినట్టు ట్విట్టర్ పేర్కొంది. ఈ పోస్టులను తొలగిస్తే ఆయా ఖాతాల నుంచి తిరిగి ట్వీట్లు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

తమ ఖాతాలను ట్విట్టర్ బ్యాన్ చేయడంపై రిపబ్లికన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా స్వేచ్ఛను హరిస్తోందని ఆరోపించారు. ‘స్పీచ్ పోలీస్’గా వ్యవహరిస్తున్న ట్విట్టర్ దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందని మండిపడ్డారు. తమ ఖాతాలను బ్లాక్ చేసిన ట్విట్టర్‌పై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.