Jaishankar: చైనాతో చర్చల ఫలితాన్ని అంచనా వేయలేను: కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్

  • చైనాతో చర్చలు కొనసాగుతున్నాయి
  • చర్చల సారాంశమంతా రహస్యం
  • ఫలితం ఎలావున్నా భారత్ సిద్ధం
  • విదేశాంగ మంత్రి జై శంకర్
Discussion with China Confidential says Jai Shankar

లడఖ్ ప్రాంతంలో నెలకొన్న ప్రతిష్ఠంభనపై ఇండియా, చైనాల మధ్య జరుగుతున్న చర్చల్లో ఎలాంటి ఫలితం వస్తుందన్న విషయాన్ని తాను అంచనా వేయలేనని విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ వ్యాఖ్యానించారు. ఈ చర్చల సారాంశం కూడా రహస్యమని ఆయన అన్నారు.

చర్చలు కొనసాగుతున్నాయని ఇండియా ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో ఆయన వ్యాఖ్యానించారు. లడఖ్ విషయంలో ఉన్న సైనిక బలగాలను ఇరు దేశాలూ పూర్తిగా వెనక్కు తీసుకోవాల్సిందేనని భారత్ పట్టుబడుతోందని ఆయన అన్నారు. ఈ ప్రాంతంలో ఏప్రిల్ కు పూర్వం ఉన్న పరిస్థితిని పునరుద్ధరించడమే తమ ప్రయత్నమని అన్నారు.

అయితే, ఇప్పటివరకూ ఇరు దేశాల సైనికులూ సరిహద్దులను వీడి వెనక్కు వెళ్లలేదు. జాతీయ భద్రతా సలహాదారుల స్థాయి చర్చల తరువాత చైనా మరింతగా రెచ్చిపోయింది. భారత్ ను పలుమార్లు రెచ్చగొట్టే యత్నాలు చేసింది. మరిన్ని ప్రాంతాల్లోకి చొరబడేందుకు ప్రయత్నించింది. కేవలం సరిహద్దుల్లో మాత్రమే కాదు. లడఖ్ రీజియన్ లో భారత్ కొత్తగా వంతెనలు ప్రారంభించడంపై చైనా ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసింది.

ఈ నేపథ్యంలోనే జై శంకర్ స్పందించారు. "జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రాంతాల్లోని సరిహద్దులు మారబోవు. అదంతా భారత్ లో అంతర్భాగమే. భారత అంతర్గత వ్యవహారాల విషయంలో స్పందించేందుకు చైనాకు హక్కు లేదు. చైనాకే కాదు. మరే దేశానికీ ఆ హక్కు లేదు" అని అన్నారు. ఎల్ఏసీ విషయంలో 1959లో బీజింగ్ లో జరిగిన పరస్పర అవగాహనా ఒప్పందాన్ని జై శంకర్ గుర్తు చేశారు.

More Telugu News