మాజీ మంత్రి నాయిని ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స

16-10-2020 Fri 09:00
Naini Narshimha Reddy health in critical condition
  • కరోనా నుంచి కోలుకుని ఇటీవలే డిశ్చార్జ్ అయిన నాయిని
  • ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో మంగళవారం మళ్లీ ఆసుపత్రిలో చేరిక
  • నాయిని భార్య అహల్యకు కూడా కరోనా

తెలంగాణ మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్యం మరింత విషమించింది. శరీరంలో ఆక్సిజన్ స్థాయులు ఒక్కసారిగా పడిపోవడంతో మంగళవారం ఆయన జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం అడ్వాన్స్‌డ్ క్రిటికల్ కేర్ యూనిట్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. అంతకుముందు కరోనా బారినపడిన నాయిని గత నెల 28న బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. 16 రోజుల అనంతరం కోలుకున్నారు. పరీక్షల్లో నెగటివ్ రావడంతో డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు.

అయితే, తనకు ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉందని చెప్పడంతో పరీక్షలు నిర్వహించగా న్యుమోనియా సోకినట్టు గుర్తించారు. దీనికి తోడు ఆక్సిజన్ స్థాయులు కూడా పడిపోవడంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. మరోవైపు, కరోనా బారినపడిన నాయిని భార్య అహల్య బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు. నాయిని అల్లుడు, రాంనగర్ డివిజన్ కార్పొరేటర్ అయిన వి. శ్రీనివాసరెడ్డి, ఆయన పెద్ద కుమారుడు కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.