కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే.. రోజుకు 10 లక్షల మందికి ఇస్తాం: శోభన కామినేని

16-10-2020 Fri 06:59
Shobana kamineni about covid vaccine distribution
  • పూర్తి నాణ్యతతో కూడిన టీకాను ప్రజలకు అందిస్తాం
  • వ్యాక్సిన్‌ను వేగంగా, సురక్షితంగా ఇవ్వడంలో ప్రభుత్వానికి సహకరిస్తాం
  • 10 వేల మంది శిక్షణ పొందిన నిపుణులను సిద్ధం చేస్తున్నాం

కరోనా మహమ్మారికి టీకా అందుబాటులోకి వచ్చిన వెంటనే రోజుకు 10 లక్షల మందికి ఇస్తామని అపోలో గ్రూప్ హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్‌పర్సన్ శోభన కామినేని తెలిపారు. నిన్న జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన శోభన.. పూర్తి నాణ్యతా ప్రమాణాలు కలిగిన టీకాను దేశ ప్రజలకు అందిస్తామన్నారు.

తమకు దేశవ్యాప్తంగా 70 ఆసుపత్రులు, 400 క్లినిక్‌లు, 500 కార్పొరేట్ హెల్త్ సెంటర్లు, 4 వేల ఫార్మసీలు ఉన్నాయని, వీటితోపాటు ఓమ్ని చానల్ డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారా వ్యాక్సిన్‌ను వేగంగా, సురక్షితంగా ప్రజలకు అందిస్తూ ప్రభుత్వానికి తమవంతుగా సహకరిస్తామన్నారు. టీకా నిల్వకు అవసరమైన శీతల వ్యవస్థలను సిద్ధం చేస్తున్నామని, 10 వేల మంది శిక్షణ పొందిన నిపుణులను ఇందుకు వినియోగిస్తామని శోభన కామినేని తెలిపారు.