KCR: వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు నష్ట పరిహారం ప్రకటించిన కేసీఆర్

  • ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం
  • సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశం
  • ఇళ్లు కోల్పోయిన వారికి కొత్త ఇళ్లు నిర్మిస్తామని హామీ
KCR orders to take up relief activities immediately

భారీ వర్షాల కారణంగా తెలంగాణలో హైదరాబాదుతో పాటు ఇతర ప్రాంతాల్లో పలువురు మృతి చెందారు. ఈ మరణాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. వరద పరిస్థితిపై కేసీఆర్ ఈరోజు అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వరద ప్రాంతాల్లో సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి బియ్యం, పప్పు, నిత్యావసర సరుకులు, ఆహారంతో పాటు మూడు రగ్గులను అందించాలని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో సహాయక కార్యక్రమాల కోసం రూ. 5 కోట్లు విడుదల చేశారు.

భారీ వర్షాల కారణంగా ఇళ్లు పూర్తిగా కోల్పోయిన వారికి కొత్త ఇళ్లు మంజూరు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. కూలిపోయిన ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లను నిర్మిస్తామని చెప్పారు. అపార్ట్ మెంట్ సెల్లార్లలో, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నీటిని వెంటనే తొలగించాలని ఆదేశించారు. నీళ్లను పూర్తిగా తొలగించిన తర్వాతే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని చెప్పారు. చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న కాలనీలే ఎక్కువగా ముంపుకు గురైనట్టు కేసీఆర్ తెలిపారు.

More Telugu News