భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి: గల్లా జయదేవ్

15-10-2020 Thu 20:35
Galla Jaydev demands ex gratia for farmers
  • ఉత్తరాంధ్రలో వర్ష విలయం
  • పలు ప్రాంతాల్లో వరదలు
  • భారీగా నీట మునిగిన పంటలు

వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తం కావడమే కాకుండా, పంటలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ స్పందించారు. ఈ ఏడాది ఏపీలో వరుసగా మూడోసారి వరదలు సంభవించాయని, దాంతో పలు ప్రాంతాలు, పంటలు జలమయం అయ్యాయని తెలిపారు.

అనేకచోట్ల లంకలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయని వెల్లడించారు. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలతో బాధితులను ఆదుకోవాలని, నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నానని గల్లా జయదేవ్ ట్వీట్ చేశారు. తన ట్వీట్ తో పాటు జల విలయం గురించి పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్స్ ను కూడా పంచుకున్నారు.

అటు, ఉండి నియోజకవర్గంలో వరద ముంపుకు గురైన ప్రాంతాలను టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు పరిశీలించారు. ఓ పడవలో పర్యటిస్తూ బాధితులను పరామర్శించారు. రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని అధికారులతో కలిసి పట్టణంలోని పలు డివిజన్లలో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.