టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విరాట్ కోహ్లీ... మళ్లీ వచ్చిన గేల్!

15-10-2020 Thu 19:18
Virat Kohli won the toss and elected bat first against Kings XI Punjab
  • ఐపీఎల్ లో నేడు బెంగళూరు వర్సెస్ పంజాబ్
  • నేటి మ్యాచ్ లో ఆడుతున్న గేల్
  • ఎలాంటి మార్పుల్లేకుండా బరిలో దిగుతున్న బెంగళూరు

ఐపీఎల్ లో నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా నిలుస్తున్న ఈ మ్యాచ్ లో బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ పొడిగా ఉండడంతో బ్యాటింగ్ కు అనుకూలిస్తుందని భావిస్తున్నామని కోహ్లీ తెలిపాడు. జట్టులో ఎలాంటి మార్పుల్లేవని, గత మ్యాచ్ లో ఆడిన జట్టునే ఈ మ్యాచ్ కోసం బరిలో దింపుతున్నట్టు కోహ్లీ వివరించాడు.

ఇక, పంజాబ్ జట్టులో పెద్ద మార్పు ఏదైనా ఉందంటే విధ్వంసక ఆటగాడు క్రిస్ గేల్ ను తుది జట్టులోకి తీసుకోవడమే. ఈ ఐపీఎల్ లో గేల్ తన మొదటి మ్యాచ్ ఆడుతున్నాడు. ఈసారి పంజాబ్ టీమ్ కు ఆడుతున్న దీపక్ హుడా కూడా తుదిజట్టులో స్థానం సంపాదించాడు. మురుగన్ అశ్విన్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. మన్ దీప్, ప్రభ్ సిమ్రన్, ముజీబ్ లను పక్కనబెట్టారు. బెంగళూరు జట్టు ఇప్పటివరకు 7 మ్యాచ్ లు ఆడి 5 విజయాలు సాధించగా, పంజాబ్ జట్టు 7 మ్యాచ్ లు ఆడి కేవలం ఒక్క మ్యాచ్ లో గెలిచి పాయింట్ల పట్టికలో చివరన నిలిచింది.