యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ కు తప్పిన ముప్పు

15-10-2020 Thu 19:00
Yadadri district collector Anita Ramachandran escaped from an road accident
  • కలెక్టర్ కారును ఢీకొన్న లారీ
  • కారు ముందు భాగం ధ్వంసం
  • అదనపు కలెక్టర్ కారులో వెళ్లిన అనితా రామచంద్రన్

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ ఓ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆమె ప్రయాణిస్తున్న వాహనాన్ని ఓ లారీ ఢీకొనగా, డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఆమె క్షేమంగా బయటపడ్డారు. ఇటీవల భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో రామన్నపేట, చౌటుప్పల్ మండలాల్లో జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు ఆమె ఆయా మండలాల్లో పర్యటించారు. పర్యటన పూర్తి చేసుకుని తిరిగి భువనగిరి క్యాంపు కార్యాలయానికి వస్తుండగా అనాజీపురం వద్ద ప్రమాదం జరిగింది.

వేగంగా వచ్చిన లారీ ఎదురుగా వస్తున్న ఓ కారుతో పాటు కలెక్టర్ వాహనాన్ని కూడా ఢీకొట్టింది. అయితే కలెక్టర్ అనితా రామచంద్రన్ కారు డ్రైవర్ అప్రమత్తంగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. కారు ముందు భాగం కొద్దిమేర దెబ్బతినడం తప్ప, వాహనంలోని కలెక్టర్ సహా ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, తన కారుకు ప్రమాదం జరగడంతో కలెక్టర్ అనితా రామచంద్రన్ అడిషినల్ కలెక్టర్ కారులో భువనగిరి చేరుకున్నారు.