ఆ గంజాయి తాగేవాడ్ని నా కూతురు ఎందుకు పెళ్లి చేసుకుంటుంది?: దివ్య తేజస్విని తల్లి ఆక్రోశం

15-10-2020 Thu 18:44
Divya Tejaswini mother Kusuma talks to media
  • విజయవాడలో ప్రేమోన్మాది ఘాతుకం
  • యువతి గొంతుకోసి హత్య
  • ప్రేమ, పెళ్లి అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారన్న యువతి తల్లి

విజయవాడలో దివ్య తేజస్విని అనే ఇంజినీరింగ్ విద్యార్థినిని నాగేంద్రబాబు అనే యువకుడు గొంతు కోసి చంపడం తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే తన కుమార్తెపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ మృతురాలి తల్లి కుసుమ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నాగేంద్ర ఒక తిరుగుబోతు అని, అలాంటివాడితో తన కుమార్తెకు ప్రేమ, పెళ్లి అని సంబంధం అంటగడుతూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు..

అతడు గంజాయి తాగుతూ, ఎందుకూ పనికిరాకుండా తిరుగుతుంటాడని, అలాంటివాడిని తన కుమార్తె ఎందుకు పెళ్లి చేసుకుంటుందని ఆమె ఆక్రోశించారు. ఫొటోలు మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దయచేసి తన కుమార్తె గురించి అవాస్తవాలు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. దివ్య తేజస్విని భీమవరంలోని మహిళా ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతోంది. తమ కుమార్తెను ఎంతో ప్రేమగా చూసుకునేవాళ్లమని కుసుమ వెల్లడించారు.