Khushboo: బీజేపీ నేత ఖుష్బూపై 50 పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసిన దివ్యాంగుల సంఘం

  • ఇటీవలే కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన ఖుష్బూ
  • కాంగ్రెస్ కు మేధో వైకల్యం ఏర్పడిందంటూ వ్యాఖ్యలు
  • ఖుష్బూ వ్యాఖ్యలపై దివ్యాంగుల సంఘం ఆగ్రహం
Differently abled people rights organization complains against Khushboo

ప్రముఖ సినీ నటి ఖుష్బూ ఇటీవలే కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ మారిన సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. కాంగ్రెస్ కు మేధో వైకల్యం ఏర్పడిందని, కాంగ్రెస్ నేతలు మానసిక వికలాంగులని ఖుష్బూ విమర్శలు చేశారు. ఆమె వ్యాఖ్యలపై తమిళనాడు అసోసియేషన్ ఫర్ ద రైట్స్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ కేర్ గివర్స్ అనే దివ్యాంగుల హక్కుల సంఘం మండిపడింది. ఖుష్బూ వ్యాఖ్యలు అభ్యంతరకరమని పేర్కొంది.

దాంతో నష్టనివారణకు ఉపక్రమించిన ఖుష్బూ క్షమాపణలు తెలుపుతూ ఓ పత్రికా ప్రకటన ఇచ్చారు. కానీ, దివ్యాంగుల హక్కుల సంఘం మాత్రం ఖుష్బూ క్షమాపణలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని, ఆమెపై రాజీలేని పోరాటం చేస్తామని అంటోంది. ఈ క్రమంలో సంఘం కార్యకర్తలు ఖుష్బూపై 50 పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. ఖుష్బూ చట్టాన్ని అతిక్రమించారని, ఆమెపై చర్యలు తీసుకోవాల్సిందేనని వారు పేర్కొన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలకు చట్టప్రకారం ఆరు నెలల శిక్ష పడొచ్చని తెలిపారు.

More Telugu News