వెబ్ సీరీస్ లోకి దిగుతున్న మాధురి దీక్షిత్

15-10-2020 Thu 16:20
Madhuri Dixith to act in a web series
  • ఒకప్పుడు నెంబర్ వన్ నాయికగా మాధురి 
  • కరణ్ జొహార్ నిర్మించే వెబ్ సీరీస్ కి గ్రీన్ సిగ్నల్
  • నెలాఖరు నుంచి నాసిక్ లో షూటింగ్
  • నాసిక్ లో పదిహేను రోజుల తొలి షెడ్యూల్  

ఒకపక్క సినిమాలలో నటిస్తూనే మరోపక్క వెబ్ సీరీస్ లలో కూడా ఇప్పుడు పలువురు కథానాయికలు నటిస్తున్నారు. పారితోషికం పరంగా బాగా వర్కౌట్ అవుతుండడంతో ఒకళ్లని చూసి మరొకళ్లు ఇటువైపు దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ కూడా వెబ్ సీరీస్ లో నటించడానికి ఇప్పుడు  సమాయత్తమవుతోంది. 

ఒకప్పుడు బాలీవుడ్ లో నెంబర్ వన్ కథానాయికగా రాణించిన మాధురి ఇప్పటికీ వన్నెతరగని గ్లామర్ తో ఆకట్టుకుంటోంది. సినిమాలలో కూడా అవకాశాలు వస్తున్నప్పటికీ ఎందుకనో ఆమె అంతగా మక్కువ చూపడం లేదు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఫిలిం మేకర్ కరణ్ జొహార్ నిర్మించే వెబ్ సీరీస్ లో ప్రధాన పాత్ర పోషించడానికి ఆమె ఓకే చెప్పారు. ఈ సీరీస్ షూటింగ్ ను ఈ నెలాఖరు నుంచి మహారాష్ట్రలోని నాసిక్ లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇందుకోసం నాసిక్ లో కథకు సరిపోయే ఒక భవంతిని తీసుకుని షూటింగుకి అనుకూలంగా మార్చుకుంటున్నారు. పదిహేను రోజుల షెడ్యూల్ కోసం మరికొన్ని రోజుల్లో మాధురి అక్కడకు వెళ్లనుంది. శ్రీరావ్ దర్శకత్వం వహించే ఈ సీరీస్ ను నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేస్తారు.