Kerala Gold Smuggling: కేరళ గోల్డ్ స్మగ్లింగ్ స్కామ్ కు దావూద్ ఇబ్రహీంతో లింకులున్నాయి: ఎన్ఐఏ

NIA tells court Kerala gold smuggling scam have links with Dawood Ibrahim
  • సంచలనం సృష్టించిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ స్కాం
  • మాజీ దౌత్య ఉద్యోగి స్వప్న సురేశ్ పై ఆరోపణలు
  • దావూద్ పాత్ర ఉన్నట్టు కోర్టుకు తెలిపిన ఎన్ఐఏ
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కుంభకోణంలో మాజీ దౌత్య ఉద్యోగి స్వప్న సురేశ్ ఉండడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అత్యున్నత స్థాయి అధికార వర్గాలతో ఉన్న పరిచయాల ఆధారంగా స్వప్న సురేశ్ బంగారం స్మగ్లింగ్ లో పాలుపంచుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఓ కేరళ మంత్రిపైనా ఆరోపణలు వచ్చాయి. ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి ఎం.శివశంకర్ కు స్వప్న సురేశ్ తో సంబంధాలున్నాయని ఆరోపణలు రాగా, ఆయనను పదవి నుంచి తప్పించారు.

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ స్కాంపై దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తాజాగా న్యాయస్థానానికి కీలక సమాచారం నివేదించింది. ఈ బంగారం తరలింపులో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు, మాఫియా కింగ్ దావూద్ ఇబ్రహీం పాత్ర ఉందని భావిస్తున్నట్టు ఎన్ఐఏ న్యాయస్థానానికి వెల్లడించింది.

బంగారం అక్రమరవాణా ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు, జాతి వ్యతిరేక కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నాడని నిఘా వర్గాలు సమాచారం అందించాయని ఎన్ఐఏ వివరించింది. నిందితుల్లో ఒకడైన రమీజ్ ను విచారించడం ద్వారా ఎన్ఐఏ కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. కాగా, దౌత్య మార్గాలను బంగారం స్మగ్లింగ్ చేసేందుకు ఉపయోగించుకున్న నిందితులకు బెయిల్ ఇవ్వవద్దని ఎన్ఐఏ న్యాయస్థానాన్ని కోరింది.

కొన్నాళ్ల కిందట విదేశాల నుంచి స్మగ్లింగ్ చేసిన 30 కిలోల బంగారాన్ని తిరువనంతపురం విమానాశ్రయంలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. యూఏఈ కాన్సులేట్ చిరునామాతో ఈ పార్సెల్ రావడంతో స్మగ్లింగ్ జరుగుతోందన్న విషయాన్ని గుర్తించారు. స్వప్న సురేశ్ గతంలో యూఏఈ కాన్సులేట్ లోనే ఉద్యోగినిగా పనిచేశారు.
Kerala Gold Smuggling
Dawood Ibrahim
NIA
Court

More Telugu News