ఏపీ మంత్రి వెల్లంపల్లికి అనారోగ్యం.. ప్రత్యేక విమానంలో హైదరాబాదుకు తరలింపు!

15-10-2020 Thu 15:39
Minister Vellampalli shifted to Hyderabad as his health is not good
  • ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న వెల్లంపల్లి
  • మళ్లీ కరోనా సోకినట్టు సమాచారం
  • హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స

ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్న ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఆయనను మెరుగైన వైద్యం కోసం విజయవాడ నుంచి హైదరాబాదుకు ప్రత్యేక విమానంలో తరలించారు. హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయనకు కరోనా మళ్లీ తిరగబెట్టినట్టు సమాచారం.

గత నెలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వెల్లంపల్లి పాల్గొన్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ముఖ్యమంత్రి జగన్ వెళ్లినప్పుడు కూడా ఆయన హుషారుగా ఉన్నారు. ఆ తర్వాత కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో... విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. అనంతరం కరోనానుంచి కోలుకున్నారు.

ఆ తర్వాత ఈనెల 8న విజయవాడలో 'జగనన్న విద్యాకానుక' కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు కిట్లు పంపిణీ చేశారు. మరోవైపు ఎల్లుండి నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ ను కలిసి ఆహ్వాన పత్రికను కూడా అందించారు. ఈ తరుణంలో ఆయన అనారోగ్యానికి గురయ్యారు. అయితే ఆయనకు మళ్లీ కరోనా సోకిందనే విషయాన్ని వైద్యులు ఇంకా నిర్ధారించలేదు.