పెరిగిన ప్రధాని మోదీ చరాస్తుల విలువ.. పూర్తి వివరాలు ఇవిగో!

15-10-2020 Thu 15:11
Modi income increases
  • 15 నెలల్లో రూ. 36.53 లక్షలు పెరిగిన మోదీ సంపద
  • మోదీ చరాస్తుల విలువ రూ. 1,75,63,618 
  • ఫిక్సుడు డిపాజిట్ల ద్వారా పొదుపు చేస్తున్న మోదీ

ప్రధాని మోదీ చరాస్తులు గత 15 నెలల కాలంలో రూ. 36.53 లక్షలు పెరిగాయి. ఆయన చరాస్తుల విలువ రూ. 1,39,10,260 నుంచి రూ. 1,75,63,618కి పెరిగింది. ఒక మధ్య తరగతి వ్యక్తి మాదిరే ఆయన తన జీతంలో అధిక భాగాన్ని బ్యాంకుల్లో ఫిక్సుడు డిపాజిట్లు చేశారు. చాలా పొదుపుగా వ్యవహరిస్తున్నారు. గుజరాత్ గాంధీనగర్ లో తన కుటుంబంతో కలిపి ఇల్లు, స్థలం ఉన్నాయి. ఈ వివరాలను ప్రధాని కార్యాలయం వెల్లడించింది.

ప్రతి నెలా జీతాన్ని ఫిక్సుడు చేయడం వల్ల మోదీ చరాస్తులు పెరిగాయి. స్థిరాస్తుల్లో మాత్రం ఎలాంటి తేడా లేదు. గాంధీనగర్ లో ఉన్న ఇల్లు, స్థలం విలువ రూ. 1.1 కోట్లు. ఆయనకు జీవిత బీమా ఉంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్లలో కూడా పొదుపు చేశారు. జూన్ 30 నాటికి ఆయన పొదుపు ఖాతాలో రూ. 3.38 లక్షలు ఉన్నాయి. ఆయన వద్ద నగదు రూపంలో రూ. 31,450 ఉన్నాయి.