విజయవాడలో కలకలం.. ప్రేమించట్లేదని అమ్మాయిని కత్తితో పొడిచి చంపిన యువకుడు

15-10-2020 Thu 13:55
murder in vijayawada
  • మాచవరానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని వెంటపడిన యువకుడు
  • ఆమె ఇంటికి వెళ్లి చంపేసిన వైనం
  • ఆపై కత్తితో పొడుచుకున్న యువకుడు  

విజయవాడలో అతి దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమోన్మాది చేతిలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. విజయవాడలోని మాచవరం పోలీసు స్టేషన్ పరిధిలోని క్రీస్తురాజపురంకు చెందిన ఓ యువతి ఇంజనీరింగ్ చదువుతోంది. ప్రేమ పేరుతో స్వామి అనే యువకుడు ఆమె వెంటపడేవాడు. తనను ప్రేమించాలని వేడుకునేవాడు. దీనికి ఆమె అంగీకరించకపోవడంతో ఆమె ఇంటికి వెళ్లి ఆమెపై కత్తితో పొడిచాడు.

అనంతరం తానూ కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. యువతి, ప్రేమోన్మాదిని వైద్య సిబ్బంది ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే, యువతికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.  నిందితుడు స్వామి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం అందాల్సి ఉంది. ఈ ఘటనపై మహిళా సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సమాఖ్య ఏపీ అధ్యక్షురాలు దుర్గా భవాని ఆగ్రహం వ్యక్తం చేశారు.