Jagan: తన కేసుల్లో లబ్ధి కోసమే లేఖలు రాస్తున్నారు... జగన్ పై సీజేఐకి లేఖ రాసిన న్యాయ నిపుణులు

  • సీజేఐ ఎస్ఏ బాబ్డేకి లేఖ రాసిన సీఎం జగన్
  • జగన్ పై 31 కేసులు ఉన్నాయన్న జస్టిస్ నౌషాద్ అలీ
  • లేఖ ప్రభావం ఆ కేసుల్లో తీర్పులిచ్చే న్యాయమూర్తులపై పడుతుందని వెల్లడి
Legal experts comments on CM Jagan letter to CJI

కొందరు న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ ఏపీ సీఎం జగన్ నేరుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డేకి లేఖ రాయడం సంచలనం సృష్టించింది. అయితే సీఎం జగన్ సీజేఐకి లేఖ రాయడాన్ని పలువురు న్యాయనిపుణులు తప్పుబడుతున్నారు. జగన్ లేఖను వ్యతిరేకిస్తూ ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ నౌషాద్ అలీ, సుప్రీంకోర్టు న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ సీజేఐ ఎస్ఏ బాబ్డేకి లేఖలు రాశారు.

జగన్ పై 31 కేసులు ఉన్నాయని, సీజేఐకి ఆయన రాసిన లేఖ ప్రభావం ఆ కేసుల్లో తీర్పు ఇచ్చే న్యాయమూర్తులపై పడుతుందని జస్టిస్ నౌషాద్ అలీ అభిప్రాయపడ్డారు. తన కేసుల్లో లబ్ది కోసమే జగన్ లేఖ రాసినట్టు అర్థమవుతోందని పేర్కొన్నారు.

మరోవైపు, సుప్రీంకోర్టు న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ సీఎం జగన్ వైఖరి పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని జస్టిస్ ఎన్వీ రమణ తీర్పు ఇచ్చారని, అప్పటినుంచి జస్టిస్ ఎన్వీ రమణపై సీఎం జగన్ ఆగ్రహంతో ఉన్నారని ఆరోపించారు. రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్న ఉద్దేశంతో తీర్పు ఇచ్చిన జస్టిస్ ఎన్వీ రమణపై ఆరోపణలు చేయడం సబబు కాదని అభిప్రాయపడ్డారు. న్యాయస్థానాన్ని పూర్తి స్థాయిలో సమావేశపరిచి సీఎం జగన్ పై చర్యలు తీసుకోవాలని సూచించారు.

అటు, సీజేఐకి నేరుగా సీఎం జగన్ లేఖ రాయడాన్ని ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ తో పాటు, సుప్రీంకోర్టు అడ్వొకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశాయి. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల తీర్పులకు ఉద్దేశాలు ఆపాదించేలా జగన్ వ్యవహారశైలి ఉందని ఆ రెండు సంఘాలు విమర్శించాయి. సీజేఐకి జగన్ లేఖ రాయడాన్ని ఖండిస్తున్నట్టు పేర్కొన్నాయి.

More Telugu News