Janagaon: అందరూ చూస్తుండగానే కుప్పకూలిపోయిన సర్దార్ సర్వాయి పాపన్న కోట.. వీడియో ఇదిగో

  • ముందుగానే గుర్తించిన స్థానికులు 
  • తప్పిన ప్రాణనష్టం
  • రఘునాథపల్లి అధికారులపై మండిపాటు

తెలంగాణ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు పాత భవనాలు కుప్పకూలిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చారిత్రక కట్టడాలకూ ముప్పువాటిల్లుతోంది. జనగామ జిల్లాలోని రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్‌ గ్రామంలో తెలంగాణ పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న కట్టిన కోట స్థానికులు చూస్తుండగానే నేలమట్టమైంది.

వర్షాల కారణంగా ఆ కోట బలహీనపడిపోయి కూలిపోయే స్థితికి చేరుకున్న విషయాన్ని ముందుగానే గుర్తించిన స్థానికులు అక్కడ నుంచి దూరం వెళ్లడంతో ప్రమాదం తప్పింది. దాని కింద ఉన్న నాలుగు ఇళ్లు ధ్వంసమైపోయినట్లు తెలిసింది. 18వ శతాబ్దంలోని ఈ కోటకు మొదట పగుళ్లు ఏర్పడ్డాయి. ఆ తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ప్రాణ నష్టం జరగపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను స్థానికులు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు.

తెలంగాణ సర్కారు ఈ కోటను పర్యాటక ప్రాంతంగా ప్రకటించింది. ఇప్పటికే దాని కోసం 4.5 కోట్లు మంజూరు చేసింది. అయినప్పటికీ ఈ ప్రాంతం అభివృద్ధి జరగకపోవడం గమనార్హం. కోట కూలడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు దాని గురించి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని విమర్శిస్తున్నారు.  
         

More Telugu News